Telangana: పసిబిడ్డకు ఊపిరి పోసి పురిట్లోనే ఆయువు వదిలిన భార్య.. ఆ బాధను తట్టుకోలేక భర్త కూడా..
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్ కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్.. తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరిని ప్రేమించాడు. వీరిద్దరి ప్రేమను యువతి తల్లీదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం విహహం చేసుకుని..

Telangana: ప్రేమ అనే పదం ఎంతో విలువైనది. లవ్ అంటే కేవలం అబ్బాయి.. అమ్మాయి మధ్య ఉండే ప్రేమ మాత్రమే కాదు.. పెళ్లైన తర్వాత.. భార్య, భర్తల మధ్య ఉండేది ప్రేమే.. చాలా మంది పెళ్లి ముందు వరకే ప్రేమ అనుకుంటుంటారు. కొంతమంది మాత్రం ప్రేమకు నిజమైన అర్థాన్నిస్తూ.. బతికినా.. చచ్చినా ఇద్దరు కలిసే అనుకునేవాళ్లుంటారు. భార్య చనిపోయిందని, భర్త.. భర్త చనిపోయిందని భార్య ఆత్మహత్య చేసుకునేవారిని చూస్తుంటాం. ఒక్కోసారి ఇద్దరు చనిపోతే వారికి పుట్టిన బిడ్డలు ఒంటరైన ఘటనలు గతంలో చూశాం. సరిగ్గా ఇలాంటి హృదయవిదారక ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వారిద్దరూ ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుని.. సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వారి ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. వారి ప్రేమను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో.. అందుకే ఇక సెలవంటూ కన్న బిడ్డను ఒంటరి చేసి ఇద్దరిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది విధి.
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్ కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్.. తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరిని ప్రేమించాడు. వీరిద్దరి ప్రేమను యువతి తల్లీదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం విహహం చేసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. నగరంలోని మౌలాలి సమీపంలో నివాసం ఉంటూ.. భార్య, భర్తలిద్దరూ ఎంతో అప్యాయంగా ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య భీమేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో పక్కింటి వారి సాయంతో ఆమెను నేరేడ్ మెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి బాగోకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ప్రాణం విడిచింది. ఓ పక్క చిన్నారి ప్రాణపాయ స్థితిలో ఉండటం, మరోవైపు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృత్యుఒడికి చేరడంతో మనస్థాపానికి గురైన నవీన్ కుమార్ తాను చనిపోవాలని నిర్ణయించుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈనెల 19వ తేదీ రాత్రి సంజీవయ్య పార్కు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం రావడంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టగా..మృతుడి జేబులో సెల్ ఫోన్ ఆదారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వైపు భార్య చనిపోయిందన్న బాధలో తాను చనిపోవడంతో.. రెండు రోజుల క్రితం జన్మించిన చిన్నారి అనాథగా మారింది. భార్య భర్తల మృతదేహాలు గాంధీ ఆసుపత్రి మార్చురీలో, వెంటిలెటర్ పై చిన్నారి.. ఈపరిస్థితి ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..



