Telangana: నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.. అధికారులకు మంత్రి వార్నింగ్..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ అలర్ట్ చేశారు. మూడు నాలుగు రోజుల పాటు ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోని నీటిపారుదల శాఖ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ రివ్యూ మీట్‌లో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌తోపాటు.. ఈఎన్‌సీలు, సీఈలు, ఈఈలతోపాటు పలువురు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నీటి పారుదల శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి ఉత్తమ్.
నాలుగైదు రోజులపాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నీటి పారుదలశాఖలోని లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలన్నారు. ఎవ్వరూ సెలవుల్లో ఉండకూడదని.. కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఒకవేళ చెరువులు నిండితే వాటి పట్ల అలర్ట్‌గా ఉండాలని.. కాలువలు, చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే వెంటనే కలెక్టర్లకు.. నీటి పారుదల ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. అదేసమయంలో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరినదులు, ఉప నదుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలతో పాటు.. ప్రాజెక్టుల నీటిమట్టాలకు సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు.
