AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్తగా బైకులు, కార్లు కొనేవారికి ప్రభుత్వం షాక్.. లైఫ్‌ ట్యాక్స్ పెంపు.. ఎంతంటే..?

కొత్తగా వాహనాలు కొనేవారిపై తెలంగాణ ప్రభుత్వం అదనపు భారం మోపేందుకు సిద్ధమైంది. బైకులు, కార్లతో పాటు ఇతర ఖరీదైన వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను పెంచింది. అటు ఫ్యాన్సీ నంబర్ల ఫీజును సైతం పెంచింది. లైఫ్ ట్యాక్స్ ఎంత పెంచింది..? ఎప్పటినుంచి అమల్లోకి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: కొత్తగా బైకులు, కార్లు కొనేవారికి ప్రభుత్వం షాక్.. లైఫ్‌ ట్యాక్స్ పెంపు.. ఎంతంటే..?
Vehicle Tax Increase
Krishna S
|

Updated on: Aug 14, 2025 | 8:04 AM

Share

తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. బైకులు, కార్లతో పాటు ఇతర ఖరీదైన వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను భారీగా పెంచుతూ రవాణాశాఖ జీవోలను విడుదల చేసింది. ఈ పెంపుదల ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు ఉండనుంది. పాత వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మార్చుకునే వారికి కూడా ఇదే విధమైన భారం పడనుంది.

బైకులపై పెంపు

ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలకు రెండు శ్లాబులు ఉండగా, కొత్త నిబంధనల ప్రకారం అవి నాలుగు శ్లాబులుగా మారాయి. అయితే వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష లోపు ఉంటే ఎటువంటి అదనపు భారం ఉండదు. పాత నిబంధనల ప్రకారమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి.

రూ. లక్ష దాటితే: ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష దాటితే, అదనంగా 3 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి.

రూ. రెండు లక్షలు దాటితే: ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 లక్షలు దాటితే, అదనంగా 6 శాతం లైఫ్ ట్యాక్స్ పెరుగుతుంది.

ఉదాహరణకు, రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న బైక్‌కు ఇప్పటివరకు రూ. 13,200 లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉండగా, ఇప్పుడు అది రూ. 16,500 అవుతుంది. అంటే అదనంగా రూ. 3,300 భారం పడుతుంది.

కార్లు, జీపులపై అదనపు పన్ను

కార్లకు కూడా లైఫ్ ట్యాక్స్ శ్లాబులను నాలుగు నుంచి ఐదుకు పెంచారు. రూ. 10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధర ఉన్న కార్లకు ఎలాంటి అదనపు భారం ఉండదు.

రూ. 20 లక్షలు దాటితే: ఒక శాతం అదనపు పన్ను.

రూ. 50 లక్షలు దాటితే: రెండు శాతం అదనపు పన్ను.

సంస్థలు, కంపెనీలకు చెందిన 10 సీట్ల లోపు వాహనాలపై కూడా పన్ను పెరిగింది. గతంలో రూ. 20 లక్షలకు పైగా ధర ఉన్న వాహనాలకు 20శాతం పన్ను ఉండగా, ఇప్పుడు రెండు శ్లాబులుగా మార్చారు:

రూ. 20-50 లక్షలు: 22శాతం పన్ను.

రూ. 50 లక్షలు దాటితే: 25శాతం పన్ను.

ఫ్యాన్సీ నంబర్లూ భారమే..

ఫ్యాన్సీ నంబర్లు కోసం వాహనదారులు చెల్లించాల్సిన ఫీజులు కూడా భారీగా పెరిగాయి. గతంలో ఐదు శ్లాబులు ఉండగా, ఇప్పుడు అవి ఏడుకు పెరిగాయి.

గరిష్ట ఫీజు: 9999 వంటి అత్యంత డిమాండ్ ఉన్న నంబర్‌కు గతంలో కనీస ధర రూ. 50 వేలు ఉండగా, ఇప్పుడు అది రూ. 1.50 లక్షలకు పెరిగింది.

కొత్త శ్లాబులు: కొత్తగా రూ. 1.50 లక్షలు, రూ. 1 లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలు శ్లాబులు అమల్లోకి వచ్చాయి.

ఈ కొత్త నిబంధనల వల్ల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే వారికి, అలాగే ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే కాగా దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత రవాణా శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..