Telangana: ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా..?
తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరవధికంగా బంద్‌కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తమకు సుమారు రూ.10వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది.

తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక బంద్‌కు రెడీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డే నేపథ్యంలో ఆ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఇంజినీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వృత్తి విద్యా కాలేజీలు బంద్ పాటిస్తాయని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ తెలిపింది. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసిన ఫెడరేషన్ నాయకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు రూ.10 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటుందని.. విద్యా రంగం అగాధంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఖరిపై నిరసన
గతంలో కూడా కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి బకాయిల విడుదలకు విజ్ఞప్తి చేశాయి. ఈ సమస్యపై ప్రభుత్వానికి మెమోరాండం కూడా అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కాలేజీలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. కాలేజీల బంద్ కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బకాయిల వివాదం కారణంగా విద్యార్థులు నష్టపోకూడదని, ప్రభుత్వం – కాలేజీల యాజమాన్యాలు త్వరగా ఒక పరిష్కారానికి రావాలని వారు ఆశిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
