Municipality Election Results 2021: రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా అదే తీరు.. అదే జోరు.. ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలు
నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ జోష్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు మునిగారు.
Telangana Municipal Election Results: రాష్ట్రంలో మినీ సమరంగా సాగిని మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఫుల్ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్‌ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో అధికార టీఆర్ఎస్ పాగా వేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో విపక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన సొంతం చేసుకుంది.అన్ని మున్సిపాల్టీల్లోనూ హవా కొనసాగించింది. ఉదయం నుంచే ఫలితాల సరళిలో కారు దూసుకెళ్లగా.. స్వల్ప స్థానాలతో ప్రతిపక్ష పార్టీలు కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఐదు మున్సిపాలిటీల్లో రాష్ట్ర మంత్రులు ప్రచార బాధ్యతను స్వయంగా మోసి టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని అధిక్యాన్ని కట్టబెట్టారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని మరోసారి తేలిపోయింది.
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, ఆరు వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్, రెండింట కాంగ్రెస్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆ ఇతరుల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెబల్స్ అభ్యర్థులే కావడం విశేషం. ఇక, రేపోమాపో వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్‌ఎస్ సంఖ్య మరింత పెరగనుంది.
ఇక, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా సాగిన పోరులో చివరికి టీఆర్ఎస్ వశమైంది. మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ చేజిక్కించుకుంది. కొత్తూరులో కమలం పార్టీ బోణి కొట్టలేకపోయింది.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 వార్డుల్లో విజయం సాధించింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 వార్డు గెలుచుకున్నాయి. దీంతో మున్సిపల్ ఛైర్మన్ సునాయసంగా సొంతం చేసుకుంది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జరనల్‌కు కేటాయించగా 16వ వార్డు నుంచి గెలిచిన నర్సింహ గౌడ్ రేసులో ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అత్యధిక వార్టుల్లో విజయం సాధించి.. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 27 వార్డులు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 వార్డులకే పరిమితమైంది. జడ్చర్ల ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా గెలిచిన అభ్యర్థుల్లో 8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇక, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 వార్డులను సొంతం చేసుకుంది. ఒక్కొక్కటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 వార్డుల్లో విజయం సాధించారు. ఇతరుల్లో ఐదుగురు కూడా టీఆర్ఎస్ రెబెల్స్‌గా బరిలోకి దిగివారే కావడం విశేషం. వీరంతా కూడా త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం కనిపిస్తుంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. ఏ ఒక్క వార్డులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. గులాబీ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
వివిధ రకాల దృష్ట్యా వాయిదా పడ్డ మున్నిపల్ వార్డులకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడ్డాయి. నల్గొండ 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీల్లోని ఒక్కో వార్డుకు జరిగిన ఉపఎన్నికలోనూ అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉపపోరులో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి రాజ శేఖర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప భాజపా అభ్యర్థి అఖిల్ గౌడ్ పై 1272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ మద్దతిచ్చినా సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ నిలుపుకోలేకపోవడం గమనార్హం. తాజా గెలుపుతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కార్పొరేటర్ల బలం మూడుకు చేరింది. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువ పత్రాలు అందజేశారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు అనుమతించకపోవడం వల్ల సందడి అంతగా కనిపించలేదు. Read Also…. Telangana Municipalities Elections Results 2021 : తెలంగాణ పురపోరు ఫలితాల హైలైట్స్.. విజేతలు వీరే..!