Minister Mallareddy: ఇంతటి దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు.. ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి ఫైర్..
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులు ముగిశాయి. అయితే కుట్రతోనే బీజేపీ తమపై దాడులు చేయించిందని ఆరోపించారు మంత్రి మల్లారెడ్డి.
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులు ముగిశాయి. అయితే కుట్రతోనే బీజేపీ తమపై దాడులు చేయించిందని ఆరోపించారు మంత్రి మల్లారెడ్డి. దాడులు జరుగుతాయని సీఎం కేసీఆర్ ముందే చెప్పారన్న ఆయన.. ఇంత దౌర్జన్యం నేనెప్పుడూ చూడలేదన్నారు. ఇదే అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి.. ఈ తరహా ఐటీ దాడులు తెలంగాణ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామన్నారు. రెండు రోజులుగా వందల మంది అధికారులు మీదపడి తమ దుమ్మంతా దులిపేశారన్నారు. రెండు రోజుల దాడుల్లో దొరికింది గోరంత కూడా లేదన్నారు. అన్ని చోట్ల దాడులు చేసి ఏం సీజ్ చేశారన్నారు. వంద కోట్లు దొరికినట్లు నకిలీ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు మంత్రి. హాస్పిటల్‌లో ఉన్న తన కుమారుడిని సైతం బెదిరించి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. వందకోట్ల అక్రమ డొనేషన్ల టాపిక్‌పైనా మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారన్నారు. ఏ విధంగా చూసినా అంతా సక్రమమే అన్నారు మల్లారెడ్డి. ఈ దాడుల వెనుక బీజేపీ కక్ష ఉందన్నారు మల్లారెడ్డి. కావాలనే దాడులు చేయించి బదనాం చేయించిందన్నారు. ఐటీ అధికారులు గవర్నమెంట్ ఉద్యోగుల్లా వ్యవహరించలేదన్నారు. జబర్దస్త్‌గా వ్యవహరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. ఈ దాడులు పార్ట్ 1 అన్న మల్లారెడ్డి త్వరలో పార్ట్ 2 కూడా ఉంటుందన్నారు.
ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే దాడులు..
మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇప్పటికే ఆయన నివాసంలో కొంత నగదుతో పాటు.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో సీజ్ చేసిన లాకర్లను తెరవనున్నారు. అయితే ఐటీ సోదాల గురించి మిత్రులు, మీడియా ద్వారానే తెలిసిందన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి. ఐటీ దాడుల్లో ఏం సీజ్ చేశారో తెలియదన్నారు. తమ ఫోన్‌లు కూడా సీజ్ చేశారన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు దాడులు చేశారన్నారు. ఇంట్లో చిన్న పిల్లల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని, ఐటీ అధికారులు వేటకుక్కల్లా దాడి చేశారని ఆరోపించారు.
ల్యాప్‌టాప్ మిస్సింగ్..
ఇదిలాఉంటే.. ఐటీ అధికారుల ల్యాప్‌టాప్ మిస్సింగ్‌పై గందరగోళం నెలకొంది. అధికారులు ల్యాప్‌టాప్ తీసుకెళ్లాలని కోరారు పోలీసులు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ల్యాప్‌టాప్ తనది కాదన్నారు ఐటీ అధికారి రత్నాకర్. దాంతో ఆ ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపే యోచనలో ఉన్నారు పోలీసులు. రెండ్రోజుల పాటు 65 బృందాలతో 48 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 10.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు ముగియడంతో పంచనామా నివేదికను మంత్రికి అందించారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు.
కొత్త టెక్నాలజీ..
మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌లో కొత్త టెక్నాలజీ ఉపయోగించారు అధికారులు. ఇళ్లు ,కార్యాలయాలను స్పెషల్ డిటెక్టర్లతో స్కాన్ చేశారు ఐటీ అధికారులు. గోడలు, సీలింగ్ పూర్తిగా స్కాన్ చేశారు. పరిసర ప్రాంతాల్లోనూ స్కానింగ్ చేసి కరెన్సీ, బంగారం కోసం వెతికారు ఐటీ అధికారులు.
పరస్పరం ఫిర్యాదులు..
మరోవైపు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు, ఐటీ అధికారి రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రత్నాకర్ చెయ్యి పట్టుకుని పీఎస్‌కి తీసుకెళ్లారు.ఐటీ అధికారులపై మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే…విచారణకు సహకరించకుండా తమను దూషిస్తున్నారని మల్లారెడ్డిపై కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు ఐటీ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..