Telangana: ప్రమాదంలో ఉన్న జంతువుల పాలిట ఆపద్భాంధవి..120 జంతువులను రక్షించిన మహబూబాబాద్ యువతి!
Telangana: ఒక బావి. అందులో ఓ నక్క పడిపోయింది. అక్కడకు చాలా మంది వచ్చి చేరారు. అప్పటికే ఆ నక్క నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది. అక్కడ చేరిన వారు దానిని చూస్తున్నారు.
Telangana: ఒక బావి. అందులో ఓ నక్క పడిపోయింది. అక్కడకు చాలా మంది వచ్చి చేరారు. అప్పటికే ఆ నక్క నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది. అక్కడ చేరిన వారు దానిని చూస్తున్నారు. కానీ, ఒక్కరు కూడా దానిని ఎలా రక్షించాలనే ఆలోచనే చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే, ధైర్యం చేయలేకపోయారు. ఇంతలో ఓ అమ్మాయి అక్కడికి వచ్చింది. తనదగ్గర ఉన్న తాడు నడుముకు కట్టుకుంది.. చక చకా.. ఆ బావిలోకి దిగింది. నక్కను చేత పుచ్చుకుంది. మళ్ళీ జాగ్రత్తగా పైకి ఎక్కేసింది. కానీ, అప్పటికే ఆ నక్క చనిపోయింది. ఇంత కష్టపడినా దానిని రక్షించలేకపోయానే అని ఆ అమ్మాయి బాధపడింది. ఆ అమ్మాయి పేరు మొహమ్మద్ సుమా. వయసు 21 సంవత్సరాలు. తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఉంటుంది. ఈ అమ్మాయి ఇలా జంతువులను రక్షించడానికి ప్రమదాల్లోకి వెళ్ళడం మొదటిసారి కాదు. ఆమె పదకొండేళ్ళ వయసు నుంచీ ఈ పని చేస్తోంది.
సుమా..ఇప్పటికి 120కి పైగా జంతువులను రక్షించారు. దాదాపు 40 అడుగుల లోతులోని బావిలో పడిపోయిన నక్క కోసమే కాదు ఇంకా చాలా రకాల జంతువులను రక్షించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరైనా ఆమెకు ఎక్కడైనా జంతువు లేదా పక్షి ఆపదలో ఉందని చెబితే చాలు అక్కడకు వెళ్లి ఆ జంతువులను రక్షిస్తూ వస్తోంది సుమా. ఆమె ఈ పనిని తన 11వ ఏట నుంచీ చేస్తోంది. తన తల్లిదండ్రుల నుంచి ఆమె ప్రేరణ పొందింది. వారు పర్యావరణ పరిరక్షణకు కూడా పనిచేశారు. “5 వ తరగతి చదువుతున్నప్పుడు, నేను గాయపడిన పందిని రక్షించాను. రాత్రి సమయంలో నాకు కాల్ వచ్చినప్పుడల్లా, నా తండ్రి సహాయక చర్య కోసం నాతో పాటు వచ్చేవాడు, ”అని ఆమె అన్నారు. కొన్నిసార్లు ఆమె పని చాలా ప్రమాదకరమైనదిగా ఉంటుంది. కానీ, ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కొన్నేళ్ల క్రితం సుమ ఒక పైథాన్ పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే.. అది ఉదయం 10 కావచ్చు.. రాత్రి 10 కావచ్చు జంతువులు ప్రమాదంలో ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడికి ఉరుకులు పరుగులు మీద చేరుకుంటుంది సుమా. రెం తాను రక్షించిన జంతువులను ఉంచడం కోసం ఆమె తన ఇంటివద్ద ఒక షెడ్ కూడా నిర్మించుకున్నారు. 2018 లో, తల్లిని పోగొట్టుకున్న ఆరు పిల్లి పిల్లలను ఆమె రక్షించి వాటిని తన షెడ్‌కు మార్చి, చికిత్స చేసి, వాటిని కాపాడింది. తన మొబైల్ ఫోన్‌లో కానీ, టోల్ ఫ్రీ యానిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్ నంబర్ (1962) ద్వారా బాధలో ఉన్న ఒక జంతువు గురించి ఆమెకు కాల్ వచ్చిన వెంటనే, సుమా, ఒక తాడు, గన్నీ బ్యాగ్, చేతి తొడుగులను ఆయుధాలుగా తీసుకుని వెంటనే వాటిని రక్షించడానికి అక్కడికి వెళ్ళిపోతారు. ఈమె జంతువుల పట్ల చూపించే ప్రేమకు స్తానిక ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు.
Also Read: Shocking Video: రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!