Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత..? యోచిస్తున్న సర్కార్‌

Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలించే అవకాశం ఉంది..

Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత..? యోచిస్తున్న సర్కార్‌
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 17, 2021 | 10:29 AM

Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 10 నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు, ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట పాటు అంటే 6 గంటల వరకు సడలిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నైట్‌కర్ఫ్యూ మాత్రం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వర్షాలు కూడా కురుస్తున్నందున వ్యవసాయ సీజన్‌ వేగం కూడా పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. కేబినెట్‌ సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం జరిగేది అనుమానంగా మారింది. ఆ పరిస్థితి ఉంటే సీఎం కేసీఆర్‌ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారిగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తోంది. లాక్‌డౌన్‌ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగానే తగ్గుముఖం పట్టాయి. పది వేలకుపైగా నమోదైన కేసులు.. ప్రస్తుతం 1000 నుంచి 1500 వరకు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రంలో రివకరీ రేటు 96.13 శాతం ఉండగా, మరణాల రేటు 0.57 శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఆయా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతుండగా, ప్రస్తుతం పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల కంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇలా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Rythu Bandhu: తెలంగాణ‌లో రైతుబంధు స్కీమ్ కింద రెండు రోజుల్లో రూ.1.669.12 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ

Etela Rajender: నేడు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్న ఈటల రాజేందర్‌.. ఘన స్వాగతం పలకనున్న నేతలు