ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..
ఏటీఎంలో చోరీకి వచ్చిన దొంగలు సినిమా ఫక్కీలో ప్లాన్ చేసుకున్నారు. ముందుగా ఏటీఎం సెంటర్‌లోకి రావడమే ఆలస్యం ఎదురుగా కనిపిస్తున్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇక అంతా ఓకే అనుకుని పని మొదలు పెట్టారు. ఇంతలో దుండగుడి కన్ను ఏటీఎం గదిలోనే ఓ మూలపై పడింది. అంతే షాక్.. అక్కడి నుంచి వారు పరుగు మొదలు పెట్టారు...ఎందుకో తెలుసా...
ఖమ్మం జిల్లాలో దుండగులు ఏటీఎం దోపిడీకి యత్నించారు. అంతా ప్లాన్ ప్రకారం కొల్లగొట్టేందుకు యత్నించి చివరి నిమిషంలో ఉసూరుమని ఇంటిదారి పట్టారు. అంతేకాదు, వారు ఆ పని చేసే సమయంలో వారు చేసిన పని సీసీ కెమెరాకి చిక్కింది. ఇది చూసిన పోలీసులకు నవ్వు తెప్పించింది. మధిర పట్ణణంలోని ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మధిర రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఆ ఏటీఎంలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం..మాస్కులు ధరించి.. అన్ని జాగ్రత్తల ఏటీఎంలో చోరికి వచ్చారు. వారితోపాటు వెంట ఓ గునపం తెచ్చుకున్నారు. ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి చొరబడి ముందుగా అందులో ఎదురుగా కనిపిస్తున్న ఓ సీసీటీవీ కెమెరాను ధ్వంసం చేసేశాడు. ఇక తమను ఎవరూ చూడడం లేదనుకొని ధైర్యంగా పని మొదలు పెట్టారు. ఏటీఎంను కొల్లగొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుగుతో ఏటీఎంను బ్రేక్ చేస్త్న సమయంలో అందులోని ఓ దొంగ కన్ను ఏటీఎం గదిలోనే మరో మూలలో ఉన్న మరో సీసీ కెమెరాపై పడింది. దీంతో దొంగ కంగుతిన్నాడు. చేస్తున్న పనిని వదిలిపెట్టి.. కాలికి పని చెప్పాడు.
అప్పటిదాకా ఏటీఎంను కొల్లగొట్టేందుకు వారు చేసిన తతంగమంతా ఆ కెమెరాలో రికార్డయింది. దీంతో చేసేది లేక ఏటీఎం కొల్లగొట్టడం విరమించుకొని ఏమీ తెలియనట్లు జారుకున్నారు. ఈ విషయం ఏటీఎం నిర్వహకులకు తెలియడంతో వారు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. దొంగలు చేసిన విన్యాసాలన్నీ బయటపడ్డాయి. అందుకే తేలు కుట్టిన దొంగలు అనే సామెత వీరిని చూసిన తర్వాతే వచ్చిందని పోలీసులు అనుకుంటున్నారు.