TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..16 ఏళ్ల బాలిక అబార్షన్‌కి అనుమతి
TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.16 ఏళ్ల బాలిక దాల్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి
TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.16 ఏళ్ల బాలిక దాల్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ని ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.16 ఏళ్ల బాలికపై వారి బంధువైన ఆంజనేయులు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో సదరు బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వైద్యులు గర్భవతిగా నిర్ధారించారు. అయితే అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా కోఠి ప్రసూతి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో బాలిక, ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించారు.
అయితే కోర్టు బాలిక ఆరోగ్య విషయంపై వైద్యుల కమిటీ వేసింది. అబార్షన్ చేయొచ్చా లేదా తెలపాలని కోరింది. దీంతో కమిటీ బాలికకు పరీక్షలు జరిపి పిండం వయసు 26 వారాలుగా నిర్ధారించారు. కొన్ని జాగ్రత్తలతో అబార్షన్ చేయవచ్చని సూచించింది. దీంతో హై కోర్టు నిపుణులతో గర్భవిచ్చిత్తి ప్రక్రియ చేపట్టాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని ఆదేశించింది. పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని సూచించింది. నివేదికలు వచ్చిన తర్వాత అధికారులకు పంపించాలని తెలిపింది.
ఈ కేసు విషయం హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. సాధారణంగా 24 వారాలు దాటిన పిండం తొలగించడానికి అనుమతి ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందని తెలిపింది. గర్భం కోరుకునే హక్కుతో పాటు చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. అనుకోకుండా వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే బాలిక మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ముఖ్యమని పేర్కొంది.