AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది పాటు సీజన్‌తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం.. వ్యాధుల క్యాలెండర్‌ను విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ

Telangana Health Department Alert: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి జనాలను వెంటాడుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం వర్షాకాల సీజన్‌ ఉండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే..

ఏడాది పాటు సీజన్‌తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం.. వ్యాధుల క్యాలెండర్‌ను విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ
Subhash Goud
|

Updated on: Jun 15, 2021 | 8:44 AM

Share

Telangana Health Department Alert: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి జనాలను వెంటాడుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం వర్షాకాల సీజన్‌ ఉండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తుగా పలు హెచ్చరికలు జారీ చేసింది. డెంగీ, మలేరియా, ఇతర వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సీజన్‌గా వస్తుంటాయి. అయితే సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది కాలంగా ఎప్పుడైన కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రతి నిత్యం జాగ్రత్తగా ఉండాలని సీజన్‌ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూలై నుంచి అక్టోబర్‌ మధ్య డెంగీ, మలేరియా, సీజన్‌ జ్వరాలు, అలాగే నవంబర్‌- మార్చి మధ్య స్వైన్‌ ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఏప్రిల్‌ -జూన్‌ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి వెంటాడుతుంటాయి. కానీ కరోనా మాత్రం ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్‌ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్‌ నెంబర్‌ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్‌ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని తెలంగాణ ప్రజా సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.

వర్షాకాలంలో జాగ్రత్త

ప్రస్తుతం సీజన్‌లో కరోనాతో పాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్‌, డయేరియా, ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా, సీజనల్‌ జ్వరాలు వచ్చే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన క్యాలెండర్‌లో హెచ్చరించింది. అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి.

చలికాలంలో..

చలికాలంలో కరోనాతో పాటు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్‌లో వైరస్‌ల ప్రమాదం అధికం. గాలి నుంచి సోకే వైరల్‌ వ్యాధులను నియంత్రించేందుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరి.

ఎండాకాలంలో..

ఎండాలకాలంలో కరోనాతో పాటు మలేరియా, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎండ వేడికి వడదెబ్బ, ఇతర ఇన్ఫెక్షన్లు సంభవిస్తుంటాయి. ప్రజలు ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు పబ్లిక్‌ స్థలాల్లో నీడ వసతి, మంచినీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను కొనసాగించాలని, కరోనాతో పాటు వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజా సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.