AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విద్యార్థుల పోషకాహారం, వసతి, సంక్షేమ సదుపాయాల కోసం రూ.221.24 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.

గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
Girl Students
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: May 18, 2026 | 1:56 PM

Share

తెలంగాణలో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసింది. విద్యార్థుల పోషకాహారం, వసతి, సంక్షేమ సదుపాయాల కోసం రూ.221.24 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ నిధులను ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు వినియోగించనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల భోజన ఖర్చులు, కాస్మెటిక్ ఛార్జీలు, భవనాల అద్దెల చెల్లింపులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

ఇటీవల నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అనేక గురుకులాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. సరుకుల సరఫరాదారులకు బకాయిలు పేరుకుపోవడం, హాస్టళ్ల నిర్వహణలో సమస్యలు రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గతంలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు నిధుల విడుదల ఆలస్యమవడంతో రెసిడెన్షియల్ పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి నెలా నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

“అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సాధికారతే కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశ్యం” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది గురుకుల విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. పోషకాహారం, వసతి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు గురుకులాల నిర్వహణ కూడా సజావుగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us