ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల కోసం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. పండ్లలో రారాజుగా పిలవబడే మామిడి పండ్లను చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు, ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినేస్తుంటారు. అయితే, ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మామిడి పండు ఆరోగ్యానికి ఒక నిధి లాంటిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పచ్చి మామిడి తినడం వల్ల అజీర్ణం, విరేచనాలు, కడుపులో మంట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మామిడిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మామిడిలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ, ఇ లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.
మామిడి పండ్లలో ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ, ఉదయం పూట ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లకు సహజంగానే వేడి చేసే స్వభావం ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కడుపులో మంట, ఎసిడిటీ రావడమే కాకుండా, ముఖంపై మొటిమలు, చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో తినడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, మామిడి పండ్లు తినడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం. అలాగే, మామిడి పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే తినకుండా, కనీసం అర గంట నుండి గంట పాటు నీటిలో నానబెట్టి ఆ తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని వేడి స్వభావం తగ్గి, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, రుచికరమైన మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే, వాటిని ఖాళీ కడుపుతో కాకుండా సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవడం ఎంతో ముఖ్యం.




