Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్లను తగ్గించింది. ఇప్పటివరకు తొమ్మిది సిలిండర్లకు రాయితీ అందించేవారు. అయితే ఇప్పుడు పరిమితి మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

పేదలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటినుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కొత విధించింది. ఏడాదిలో కేవలం నాలుగు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్లను రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి తొమ్మిది సిలిండర్లను రాయితీపై అందించేవారు. ఇప్పుడు నాలుగుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధన రాయితీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ లభిస్తుంది.
పేదలకు షాకే..
ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీ అందిస్తున్న సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి నాలుగుకు ప్రభుత్వం తగ్గించిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం 14.2 కేజీల సిలిండర్ ధర రూ.29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతి రోజే కేంద్రం సబ్సిడీకి కొత విధిస్తూ మరో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి 14.2 కేజీల ఎల్‌పీజీ రీఫిల్‌పై రూ. 700, పెట్రోల్‌పై లీటరుకు రూ. 6, డీజిల్‌పై లీటరుకు రూ. 30 నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. అందులో భాగంగా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు సంవత్సరంలో నాలుగు రీఫిల్‌ల వరకు ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని పొందనున్నారు.
మరోసారి తగ్గింపు
కాగా 2025 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అందించేందుకు ఆమోదం తెలిపింది. 2016లో ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియాలో ఈ పథకం ప్రారంభించారు. ఆగస్టు 2021 నుంచి కనెక్షన్‌తో పాటు మొదటి సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఒక స్టవ్‌ను కూడా చేర్చారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రం పథకంతో పాటు అదనంగా ఉచిత సిలిండర్లను కూడా అందించాయి. మే 2022 నుండి ప్రభుత్వం 2022-23, 2023-24 సంవత్సరాలకు PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్‌ల వరకు ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని అందించింది. అక్టోబర్ 2023లో12 రీఫిల్‌ల వరకు సబ్సిడీని రూ.300కి పెంచారు . 2025 ఆగస్టు 8న 2025-26 సంవత్సరానికి సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్‌ల వరక సబ్సిడీని కేబినెట్ ఆమోదించింది . ఇప్పుడు ఈ సంఖ్యను నాలుగుకు తగ్గించింది.
