Mahalakshmi Scheme: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. రూల్స్‌లో మార్పులు చేసిన ప్రభుత్వం.. ఇకపై మహిళలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పొందుతున్నారు. ఈ పథకానికి సంబంధించి తాాజాగా రేవంత్ సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అదేంటంటే..?

మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి మహిళలు జీరో టికెట్ పొందేందుకు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డులు లాంటి ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మహిళల ఆధార్ కార్డులను చెక్ చేసి కండక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. అయితే ఆధార్ కార్డుల్లో పాత ఫొటోలు ఉండటంతో మహిళలను గుర్తించడం కండక్టర్లకు కష్టతరంగా మారింది. దీంతో కండక్టర్లు, మహిళల మధ్య వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీనికి చెక్ పెట్టి మహిళలు సులభతరంగా బస్సుల్లో ప్రయాణించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక ఐడీ కార్డులను ఇవ్వనుంది.
త్వరలో స్మార్ట్ కార్డులు
త్వరలో రాష్ట్రంలోని మహిళలందరికీ మహాలక్ష్మి ఐడీ కార్డ్‌లను పంపిణీ చేయనుంది. మహిళలు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పొందేందుకు ఇవి ఒక ఐడీ కార్డులా ఉపయోగపడతాయి. ఈ కార్డులపై మహిళ ఫొటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వంటి అడ్రస్ వివరాలు పొందుపర్చి ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు అత్యాధునిక చిప్ ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే మెషిన్‌తో స్మార్ట్ కార్డులపై ఉండే చిప్‌ను స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి. దీని వల్ల మహిళలు ఆధార్ కార్డును చూపించాల్సిన అవసరం లేదు. తమ దగ్గర ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన పని ఉండదు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా సులువుగా మహిళలు ప్రయాణం చేయవచ్చు.
ప్రత్యేక నెంబర్ కేటాయింపు
ప్రతీ ఒక్క వ్యక్తికి ఆధార్ ప్రత్యేక నెంబర్ ఉన్నట్లుగానే.. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతీ మహిళకు ఒక 16 అంకెల విశిష్ట నెంబర్‌ను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫొటో, అడ్రస్ వివరాలు ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డుల తయారీ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. త్వరలో ముద్రణ పూర్తి కానుంది. కార్డుల తయారీ కోసం రూ.75 కోట్ల నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది మహిళలకు కార్డులు అందించనున్నారు. తొలుత 5 లక్షల కార్డులను పైలట్ ప్రాజెక్ట్ కింద జారీ చేయనుండగా.. ఆ తర్వాత మిగతా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి అందరీ వివరాలు గతంలో సేకరించింది. ఈ వివరాల ఆధారంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది.
