Medaram Jathara: మేడారం జాతరలో కుక్కకు తులాభారం.. మరో వీడియో రిలీజ్ చేసిన తెలుగు హీరోయిన్
మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న టాలీవుడ్ హీరోయిన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఇది అమ్మవార్లను అవమానించడమేనంటూ చాలా మంది హీరోయిన్ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ మరో వీడియోను రిలీజ్ చేసిందీ అందాల తార.

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరగా గుర్తింపు ఉంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించింది. అలాంటి మేడారం జాతరలో తన అత్యుత్సాహంతో విమర్శల పాలైంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ టీనా శ్రావ్య. ఈ జాతరలో నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో టీనా కూడా వన దేవతలకు బెల్లాన్ని సమర్పించింది. అయితే తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చొపెట్టి సమ్మక్క, సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించడం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వీడియోను స్వయంగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది టీనా తీరును తప్పుపట్టారు. నటి అమ్మవార్లను అవమానించిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందంటూ నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. దీంతో తప్పు తెలుసుకున్న టీనా తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో రిలీజ్ చేసింది.
‘మేడారం జాతరలో జరిగిన దానిపై మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదని. నేను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ఇటీవలే ట్యూమర్ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్క, సారలక్కకు మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. అంతేకానీ ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో మాత్రం చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కానివ్వను. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని కోరుతున్నాను’ అని చేతులెత్తి క్షమాపణలు చెప్పింది టీనా.
వివాదానికి కారణమైన వీడియో ఇదే..
మేడారంలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన హీరోయిన్ టీనా శ్రావ్య.. పెంపుడు కుక్కకు తులాభారం వేయడం ఏంటని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు నెటిజెన్లు….#TeenaSravya #medaramjathara #TV9Telugu #dog pic.twitter.com/cU4EtWUd93
— TV9 Telugu (@TV9Telugu) January 21, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




