Telangana Election: ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించనున్న బీజేపీ..!
ధర్మపురి అసెంబ్లీ స్థానంలో ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఇక్కడ పాత కాపుల మధ్య మరోసారి పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వరుసగా ఓడిపోవడంతో.. సానుభూతి పని చేస్తుందని భావిస్తున్నారంతా. అయితే.. ఇక్కడ బీజేపీ చీల్చే ఓట్లు.. ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు.

ధర్మపురి అసెంబ్లీ స్థానంలో ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఇక్కడ పాత కాపుల మధ్య మరోసారి పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వరుసగా ఓడిపోవడంతో.. సానుభూతి పని చేస్తుందని భావిస్తున్నారంతా. అయితే.. ఇక్కడ బీజేపీ చీల్చే ఓట్లు.. ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు. దీంతో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ హౌరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ మాత్రం తగినంత ప్రభావం చూపలేకపోతుందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.
ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచీ లక్ష్మణ్ కుమార్, బీజేపీ నుంచీ ఎస్. కుమార్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ 400 పైగా ఓట్ల తేడాతో లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. అయితే.. సరిగా లెక్కించకపోవడంతోనే తాను ఓడిపోయాయానని లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. బీజేపీ మాత్రం రామగుండంకు చెందిన ఎస్. కుమార్ కు అవకాశం కల్పించింది. ఇక్కడ… పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోరు ఉండే అవకాశం ఉందంటున్నారు.
2009 నుంచీ కొప్పుల ఈశ్వర్.. లక్ష్మణ్ కుమార్ మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ పదేళ్లలో చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల. దానికి తోడు కేసిఆర్ బహిరంగ సభకు భారీగా జనం రావడంతో తన గెలుపు నల్లేరుపై నడకగా భావిస్తున్నారు. మరోసారి అవకాశం ఇస్తే.. ధర్మపురిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్. కొప్పులపై లక్ష్మణ్ కుమార్ వరుసగా ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరగడంతోనే ఓడిపోయానని లక్ష్మణ్ చెబుతున్నారు. ఇదే సానుభూతితో ఈసారి ఓట్లు కొల్లగొట్టాలని జనంలోకి వెళ్తున్నారు.
అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం ఇక్కడ పూర్తిగా హిందూత్వాన్ని నమ్ముకుంది. లక్ష్మీ నర్సింహ ఆలయ అభివృద్ధిపై వక్ష చూపుతున్నారని ఆరోపిస్తుంది. తమకు అన్ని వర్గాలు ఆదరిస్తారని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే, ప్రతీ గ్రామంలో ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ తరుపున సీఎం కేసిఆర్ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ జగిత్యాలలో నిర్వహించిన సభకు ధర్మపురి నుంచి భారీగానే జనాన్ని తరలించారు. మరోవైపు ఇంకా బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేయలేదు. కార్యకర్తల సమావేశాలకే పరిమితమవుతున్నారు. అయితే, బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. బీజేపీ చీల్చే ఓట్ల ఆధారంగానే గెలపు, ఓటములను ప్రభావం చూపనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, తాము కూడా గట్టి పోటీ ఇస్తామని బీజేపీ చెబుతుంది. ఆ పార్టీ తరుఫున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్, ఈటెల రాజేందర్ ప్రచార రంగంలోకి దిగుతున్నారు. మొత్తానికి గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…