AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Earthquake: ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?

తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంపం ప్రకంపనలు రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Telangana Earthquake: ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?
Telangana Ap Earthquake
Balaraju Goud
|

Updated on: Dec 04, 2024 | 10:46 AM

Share

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 4) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైందన్నారు NGRI రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీనగేష్. భూమి లోపల 40 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు చెప్పారు. తెలంగాణ రీజన్‌లో 5.3 భూకంప తీవ్రత అనేది అరుదు. గతంలో 1969లో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఉదయం 7.20 నుంచి 7.26 గంటల మధ్య భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.27 నిమిషాలకు వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి సహా పలుచోట్ల కంపించింది భూమి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 20ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. గోదావరి బెల్ట్‌లో భూమి పొరల్లో చాలా తేడాలున్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ప్రకంపనలు సంభవించాయంటున్నారు NGRI రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీనగేష్.

1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించింది. 1983 మేడ్చల్‌లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా.. 2021 జనవరి 26న పులిచింతలలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4తీవ్రతకు పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు ఇవే అని రిటైర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు.

భూ ప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకన్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్లు ఇచ్చాయి. పలు షాపుల్లో ఉన్న వస్తువులు కిందపడి చెల్లాచెదురయ్యాయి. ఇంటిబయట పెట్టిన బైక్‌ కూడ కదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

మంచిర్యాల, చెన్నూర్ , జైపూర్ మండలాల్లో కంపించింది భూమి. వరంగల్‌ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 నిమిషాల నుంచి 7.45 వరకూ భూమి ఊగినట్లు అనిపించింది. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి. 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు ప్రజలు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఉదయాన్ని దుకాణాల్లో ఉన్నవారు సైతం భయంతో వణికిపోయారు.

సింగరేణి కోల్‌ బెల్ట్‌కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు వచ్చాయి. కోల్‌బెల్ట్‌ దగ్గర ఉండడంతో ప్రజలు భయపడ్డారు. కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూ కంపం రావడం ఇదే తొలిసారి. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 7.27 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు జనాలు. కాసేపు ఏం అర్థం కాక భయపడిపోయారు

వీడియో చూడండి.. 

ఇక హైదరాబాద్‌ మహానగరంతోపాటు రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో భూమి 2 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది. హైదరాబాద్‌ జోన్‌2 పరిధిలో ఉంది. అందులోను తక్కువ భూ కంపాలు వచ్చే జోన్‌లో ఉన్నప్పటికీ భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది.

అటు ఏపీలోనూ పలు చోట్ల భూమి కంపించింది. విజయవాడ, విశాఖ, ఏలూరు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో భూ ప్రకంపనలు కనిపించాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో.. ప్రజలు వణికిపోయారు. నందిగామలో 4సెకన్ల పాటు, గుడివాడలో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరులో పలు సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. నందిగామలో 7సెకన్ల పాటు కనిపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..