MLC Jeevan Reddy: మీకూ, మీ కాంగ్రెస్ పార్టీకో దండం.. అనుచరుడి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది.. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని జీవన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని దారుణంగా హత్య చేశారు. కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. రక్తం మడుగులో ఉన్న గంగారెడ్డి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. పాతకక్షలతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.
మరోవైపు గంగారెడ్డి హత్యకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి హత్యకు పాల్పడిన నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఘాటుగా వ్యాఖ్యానించారు.. అవమానించారు, మానసికంగా వేధించారు.. అయినా భరించామన్నారు. కనీసం మమ్మల్ని బతకనివ్వరా అంటూ జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా.. ఇక ఉండలేనంటూ ఆవేదన వ్యక్తంచేశారు. భౌతికంగా నిర్మూలిస్తుంటే పార్టీలో ఎందుకుండాలంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాబితాపూర్ గ్రామంతో పాటు జగిత్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..