TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ఖరారు.. ముందస్తుపై నజర్.. ఏప్రిల్ సభకు రాహుల్ గాంధీ!
పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తుంటే.. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తాడును మరోవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దానికి వారు చూపుతున్న కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో అధిష్టానం వున్నట్లు తెలుస్తోంది.
TELANGANA CONGRESS ACTION PLAN READY RAHUL GANDHI TO WARANGAL MEETING: ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(Telangana CM KCR) తేల్చేసినా విపక్షాలు మాత్రం విశ్వసించడం లేదు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నాయి. ఈక్రమంలో అంతర్గతంగా వున్న ఇబ్బందులను పక్కన పెట్టిమరీ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలు సుదీర్ఘ కార్యాచరణను రెడీ చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ దీర్ఘకాల ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో సమాలోచనలు జరిపిన టీ.కాంగ్రెస్ నేతలు.. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలాఖరులో ఓరుగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. ఈ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని రప్పించేలా ప్లాన్ చేయడం ప్రారంభించారు.
యుక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ఆధారంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో నత్తనడకన సాగుతున్న వరి ధాన్యం సేకరణ అంశాన్ని హైలైట్ చేయాలని తలపెట్టారు. ఇందుకు అనుగుణంగా నెలరోజుల కార్యాచరణను పీసీసీ కార్యవర్గ భేటీ ఖరారు చేసింది. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని పంచాయితీ కార్యాలయాలు, ఐకేపీ సెంటర్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరి ధాన్యాన్ని కొనాల్సిందేనని సారాంశంతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అదేసమయంలో పార్టీ సీనియర్ నేతలు జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారు. వరి ధాన్యం కొనుగోళ్ళలో కేంద్ర, రాష్ట్రాల వైఖరిని ఎండగడతారు. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తారు. జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు ఈ మేరకు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేంద్ర, రాష్ట్రాల వైఖరిని ఎండగట్టేలా టీపీసీసీ యాక్షన్ ప్లాన్ సిద్దమైంది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ ఆఖరు వారంలో ఓరుగల్లు వేదికగా రైతు బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు. ఆ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీ.కాంగ్రెస్ నేతలు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉద్యమాల కార్యాచరణ కోసం మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏప్రిల్ రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ధరల పెంపును నిరసిస్తూ మండల, నియోజకవర్గ కేంద్రాలలో ఉద్యమాలు నిర్వహించారు. ఏప్రిల్ ఏడవ తేదీన అటు సివిల్ సప్లయ్, ఇటు విద్యుత్ సౌధ వద్ద భారీ ధర్నా చేపట్టాలని తలపెట్టారు. అదేసమయంలో 111 జీవో ఎత్తివేత చర్యలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులతో నిఫుణుల కమిటీ వేయాలని, ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని టీపీసీసీ కార్యవర్గం నిర్ణయించింది.
నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం వుంది. సాధారణంగా ఏడాది ముందు విపక్షలు ఎన్నికల యాక్షన్ ప్లాన్‌తో రెడీ అవుతాయి. కానీ.. 2018 ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న విపక్షాలు.. కేసీఆర్ వ్యూహాలను ఊహించుకుంటూ యాక్షన్ ప్లాన్ రచిస్తున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వాధినేత కదలికలకు అనుగుణంగా సవరించుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఖరీఫ్‌లో రచ్చ రేపిన ధాన్యం సేకరణ అంశం మరోసారి తెలంగాణలో చిచ్చు రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం వైఖరిని తప్పుపడుతుండగా గులాబీ నేతల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు బీజేపీ నేతలు రెడీ అయ్యారు. తెలంగాణవ్యాప్తంగా వున్న వరి ధాన్యం సేకరణ కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈక్రమంలోనే టీ.కాంగ్రెస్ నేతల భేటీలో మార్చి 28వ తేదీన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు గుప్పుమన్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావుల వ్యవహార శైలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఓదశలో జగ్గారెడ్డిపై వేటుకు రంగం సిద్దమైందన్న లీకేజీలు కూడా వచ్చాయి. కానీ అలాంటి చర్యలకుపక్రమించి కొత్త తలనొప్పులను కొనితెచ్చుకోవడం ఎన్నికలకు మంచిది కాదన్న అంతర్గత సమాలోచనల మేరకు జగ్గారెడ్డిపై వేటు నిర్ణయం పెండింగ్‌లో పడింది.
ఎన్నికలకు ముందు పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తుంటే.. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తాడును మరోవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దానికి వారు చూపుతున్న కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో అధిష్టానం వున్నట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోయే నేతకే పీసీసీ పగ్గాలివ్వాలని.. వ్యక్తిగత షోల ద్వారా పార్టీకి విజయాన్ని సాధించలేమని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. అయితే.. అచంచల విశ్వాసంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను కట్టబెట్టిన అధిష్టానం ఆయన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్ళనున్నట్లు సంకేతాల్నిస్తోంది. యాక్షన్ ప్లాన్స్ ఎలా వున్నా.. కాంగ్రెస్ నేతల్లో ఐక్యతను తీసుకురాకపోతే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావని రాజకీయ పరిశీలకులు సూచనలిస్తున్నారు. ఈ దిశగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిన దాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారపడి వుంటాయని చెబుతున్నారు.