CM Revanth Reddy: ‘ఇట్లు మీ రేవంతన్న’ అంటూ న్యూఇయర్ విషెస్ తెలిపిన సీఎం.. ప్రస్తావించిన అంశాలివే..

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్భంధాలు, ఇనుప కంచెలను తొలగించి పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం.

CM Revanth Reddy: 'ఇట్లు మీ రేవంతన్న' అంటూ న్యూఇయర్ విషెస్ తెలిపిన సీఎం.. ప్రస్తావించిన అంశాలివే..
Revanth Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Dec 31, 2023 | 9:30 PM

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్భంధాలు, ఇనుప కంచెలను తొలగించి పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి.. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.యువత భవిత తమ ప్రాధాన్యమని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్‎కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు వివరించారు.

ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నాం. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థను సమూల ప్రక్షాళనకు సంకల్పించామన్నారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్‎లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చారు. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టామని పేర్కొన్నారు.

ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు అని సూచించారు. ఇది గత పాలన కాదు.. జన పాలన అంటూ ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ..ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..