Telangana: తెలంగాణ ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.. ఆ పేరు మార్చాల్సిందేనంటూ..

Neera Cafe: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘నీరాకేఫ్’కు ‘వేదామృతం’ అనే పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana: తెలంగాణ ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.. ఆ పేరు మార్చాల్సిందేనంటూ..
Neera Cafe
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 10, 2023 | 2:04 PM

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘నీరాకేఫ్’కు ‘వేదామృతం’ అనే పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పేరును తక్షణమే మార్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవి రమణాచారికి వినతిపత్రం అందజేశారు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు. వేదాలను కించపరిచేలా కల్లు కాంపౌండ్‌కి ‘వేదామృతం’ అని పేరు పెట్టారని బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

ఇదిలాఉండగా.. ఈ వివాదంపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వేదాల్లో సురాపానకం గురించి స్పష్టంగా ఉందని గుర్తు చేసిన మంత్రి.. కౌండిల్య మహర్షికి వరంగా వచ్చిన మూడు కల్ప వృక్షాలే తాటి, కర్జూర, కొబ్బరి చెట్లు అని వివరించారు. వీటిని ప్రకృతి ఔషధాలుగా వేదాలు వివరించాయని కూడా పేర్కొన్నారు మంత్రి. అయినా కల్లు వేరు, నీరా వేరు అని మంత్రి శ్రీనివాస్ వివరించారు. వేదామృతం అనే పదంపై ఏమైనా వివాదం ఉంటే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు మంత్రి. ‘వేదాలు రాసింది ఒక బెస్త, రామాయణం రాసింది ఒక బోయ.. వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉంది. పీహెచ్‌డీ చేసిన కొంతమంది విద్యార్థులు వేదాలను అధ్యయనం చేసి.. వేదామృతం అనే పేరును సూచించారు.’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.

నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటు..

హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ‘నీరాకేఫ్‌’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ కేఫ్‌కి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. ఆ కేఫ్‌లో తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చున్నట్లు అనిపించే రీతిలో సీట్లను డిజైన్‌ చేస్తున్నారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కల్లుతో ఛీర్స్‌ చెప్పుకోవచ్చు. తెలంగాణ వంటకాల స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీక నీరాకేఫ్‌. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటి వరకు కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతున్న నీరాకేఫ్‌ మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుని.. నగర ప్రజలకు కొత్త రుచులు అందించనుంది. ఇంతలోనే ఈ పేరు రచ్చ చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..