AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: పార్టీ నేతలతో బండి సంజయ్‌ అత్యవసరంగా భేటీ.. ఇంతకీ ఈ సమావేశాల్లో ఏం చర్చించారంటే..

పాదయాత్ర ముగిసింది. కానీ..నో రెస్ట్‌...! ఆ వెంటనే పార్టీనేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు బండి సంజయ్‌. కోర్‌ కమిటీ, పదాధికారుల సమావేశాల్లో కమలనాథులు బిజిబిజీగా ఉన్నారు. ఇంతకీ ఈ సమావేశాల్లో ఏం చర్చించారు ? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?

Telangana BJP: పార్టీ నేతలతో బండి సంజయ్‌ అత్యవసరంగా భేటీ.. ఇంతకీ ఈ సమావేశాల్లో ఏం చర్చించారంటే..
Telangana Bjp
Sanjay Kasula
|

Updated on: Dec 16, 2022 | 7:33 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదో విడత పాదయాత్ర కొనసాగిన తీరుపై చర్చించారు. దాంతోపాటు ఆరో విడత ప్రజాసంగ్రామయాత్రను హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొనసాగించాలని, ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని కోర్‌కమిటీలో నిర్ణయించారు. సమావేశంలో నేతల మధ్య సమన్వయం, కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఇక బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాష్ట్రంలో బూతు స్థాయి కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని పదాధికారుల సమావేశంలో తరుణ్ చుగ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టాలని జాయినింగ్స్ కమిటీ సభ్యులకు సూచించారాయన.

అసెంబ్లీ విస్తారక్‌లతో బీఎల్‌ సంతోష్‌..

వచ్చే యేడాది ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వతీరును ఎండగట్టేలా రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 30న అసెంబ్లీ ఇంఛార్జి, అసెంబ్లీ పాలక్‌, అసెంబ్లీ కన్వీనర్‌లు, అసెంబ్లీ విస్తారక్‌లతో బీఎల్‌ సంతోష్‌తో సమావేశం జరుగుతుందన్నారు. వచ్చే నెల 7న బూత్‌కమిటీలతో నడ్డా వర్చువల్‌ భేటీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

జనంగోస.. బీజేపీ భరోసా..

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌. త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు వీఆర్‌ఎస్‌ చెప్పబోతున్నారని జోస్యం చెప్పారాయన. పార్లమెంట్ ప్రవాసీ యోజన, జనం గోస..బీజేపీ భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై కూడా సమీక్షించారు. అయితే ఈ సమావేశాలకు బీజేపీ జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హాజరవ్వలేదు. ఇక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్, డి.అర్వింద్‌, సోయం బాపురావు పార్లమెంట్ సమావేశాల కారణంగా హాజరుకాలేదు. సమావేశం తర్వాత కమలం నేతలు బీఆర్‌ఎస్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. డ్రగ్స్‌కేసులో నోటీసులకు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నాయకురాలు డి.కె.అరుణ. మొత్తానికి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం