Telangana: పుస్తెలతాడు, చెవి దుద్దుల కోసం అమానుషం.. గొంతు కోసి వివాహిత దారుణ హత్య!
చిల్లర దొంగతనాలు చేసుకునే గ్యాంగ్ ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగిపోయింది. భర్త, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో పట్టపగటు మిట్టమధ్యాహ్నం వివాహితపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మెళ్లో పుస్తెలతాడు, చెవి దుద్దులు కాజేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం (మార్చి 23) చోటు చేసుకుంది. వివాహిత దారుణ హత్య స్థానికంగా..
ఆర్మూర్, మార్చి 24: చిల్లర దొంగతనాలు చేసుకునే గ్యాంగ్ ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగిపోయింది. భర్త, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో పట్టపగటు మిట్టమధ్యాహ్నం వివాహితపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మెళ్లో పుస్తెలతాడు, చెవి దుద్దులు కాజేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం (మార్చి 23) చోటు చేసుకుంది. వివాహిత దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీకి చెందిన రాకేశ్‌తో వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లాస్య (22)కు రెండు ఏళ్ల క్రితం పెద్దలు నిశ్చయించిన వివాహం జరిగింది. వీరికి శ్రీలక్షణ అనే ఏడు నెలల పాప సంతానం. స్థానికంగా పనులు లేకపోవడంతో భర్త రాకేష్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంట్లో అత్తమామలతో కూతురుతో కలిసి లాస్య జీవిస్తోంది. ఈ క్రమంలో అత్త చిన్నుబాయి జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్న కూతురి వద్దకు శనివారం ఉదయం వెళ్లింది. కూతురిని తీసుకుని బీడీలు చుట్టేందుకు పక్కింటికి వెళ్లిన లాస్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో లాస్య కూతురు చాలా సేపటి నుంచి ఏకధాటిగా ఏడుస్తూ ఉండటం పక్కింట్లో ఉంటున్న చిట్టి అనే మహిళ గమనించింది.
దీంతో వెళ్లి చూడగా ఇంట్లో లాస్య రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన చిట్టి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది. అప్పటికే లాస్య మృతి చెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.ఎస్‌హెచ్‌వో రవి కుమార్ మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు మీడియాకు తెలిపారు. లాస్య మెళ్లో ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. క్లూస్ టీం, డాగ్‌స్కాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌హెచ్‌వో రవి కుమార్ కేసు వివరాలను వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.