Tamilisai: శాసనసభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళి సై..
సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీ. అయితే సోమవారం (మార్చి7) నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే
సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీ. అయితే సోమవారం (మార్చి7) నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Government) నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ పరంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం సరికాదంటూ బీజేపీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగానికి లోబడి నిబంధనల ప్రకారమే ఈ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం ఉండడం లేదంటూ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోవడమేనంటూ శనివారం రాజ్‌భవన్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం నా సిఫార్సు కోరింది..
‘బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ, ఆ ఆనవాయితీని కొనసాగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. కొత్త సెషన్ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక అంశాల వల్ల నా ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వమే మొదట చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు నా సిఫార్సు కూడా కోరింది. ఇప్పుడేమో గవర్నర్ ప్రసంగం లేదంటున్నారు. అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు నేను సిఫార్సు చేశాను. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు’ అని ఈ ప్రకటనలో తెలిపారు గవర్నర్.
కాగ గత కొద్ది రోజుల నుంచి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేధాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మేడారం జాతర సమయంలోనూ గవర్నర్ వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరూ కూడా అందుబాటులో లేరు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని విమర్శలు కూడా వచ్చాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీనిపై గవర్నర్ కూడా స్పందించడంతో మరింత చర్చనీయాంశంగా మారింది.
Also Read:Hair Loss: పురుషులలో అకస్మాత్తుగా బట్టతల రావడానికి ఇవే కారణాలు..!
Viral Video: సింహానికే ఝలక్ ఇవ్వాలనుకుంది !! చివరికి ?? వీడియో