Khammam: ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల వాహనంపై రాళ్ల దాడి.. స్పందించిన మంత్రి తుమ్మల.. ఏమన్నారంటే..
భారీ వర్షాలు ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేశాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే.. వరద, బురదలపై రాజకీయాలు సైతం రాజుకున్నాయి..
భారీ వర్షాలు ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేశాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే.. వరద, బురదలపై రాజకీయాలు సైతం రాజుకున్నాయి.. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మంలో బీఆర్‌ఎస్ నేతలపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారితీసింది. వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా డ్రైవర్‌కి వర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. రాళ్ల దాడి సమయంలో కారులో హరీష్‌రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వర్‌రావు ఉన్నారు. రాళ్ల దాడిలో నేతలెవరికీ గాయాలు కాలేదు. దీంతో కేడర్ అంతా ఊపిరిపీల్చుకుంది..
కారులో నేతలు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. అలర్టయిన బీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడిని అడ్డుకున్నారు. కానీ అప్పటికే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలర్టయిన పోలీసులు వాహనాన్ని బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు తరలించారు. అయితే దాడికి తెగబడింది ఎవరన్నది తెలియరాలేదు. పోలీసులు అప్రమత్తమై అక్కడి నుంచి నేతలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం అలవాటుగా మారిందన్నారు. సహాయం చేయడానికి వస్తే.. దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.
ఏదైనా సమస్య రాగానే పక్కదారి పట్టించేందుకు హింసకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఖమ్మంలో రౌడీయిజంపై మంత్రి తుమ్మల స్పందించాలని డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు.
కాగా.. బీఆర్‌ఎస్‌నేతలపై దాడి ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. వరదల్లోనూ రాజకీయాలు చేద్దామనుకుంటున్నారంటూ పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలతో లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గమని.. వాళ్ల పర్యటనలో తమ మనుషులు ఎందుకుంటారంటూ పేర్కొన్నారు. అక్కడేదో రాజకీయాలు మాట్లాడుంటారు, అందుకే ఈ దాడి జరిగి ఉండవచ్చన్నారు. తన చరిత్రేమిటో ఆ కార్లలో కూర్చున్నవారికి కూడా తెలుసని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదు.. ఇలాంటి దాడులు ఎవరు చేసినా కరెక్టు కాదంటూ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..