Telangana: కాంగ్రెస్‌లో ‘ఆ నలుగురు’ కలకలం.. టీఆర్ఎస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్నారా?

Telangana: కాంగ్రెస్‌లో ‘ఆ నలుగురు’ కలకలం.. టీఆర్ఎస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్నారా?
Congress Trs

ఆ నలుగురి నేతల తీరు కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి పొడగిట్టని నేతలు అంతా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్నారా? లేదా ఆ నలుగురి నేతలను కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరకు చేర్చుకుంటున్నారా? ఇదే కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు హాట్‌ టాఫిక్‌‌.

DONTHU RAMESH - Input Editor

| Edited By: Balaraju Goud

Feb 14, 2022 | 7:55 PM

Telangana Congress Key Leaders: ఆ నలుగురి నేతల తీరు కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) పొడగిట్టని నేతలు అంతా కేసీఆర్‌(KCR), టీఆర్‌ఎస్‌(TRS)కు దగ్గరవుతున్నారా? లేదా ఆ నలుగురి నేతలను కేసీఆర్‌, కేటీఆర్‌(KTR) దగ్గరకు చేర్చుకుంటున్నారా? ఇదే కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు హాట్‌ టాఫిక్‌‌గా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఢిల్లీ కాంగ్రెస్‌ను తాకే ఆర్ధిక ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి.. రేవంత్‌తో అంటిముట్టనట్లు ఉంటున్నారు. ఆతరువాత కేసీఆర్‌కు తద్వారా టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశాడనేది ఆయన వ్యతిరేకుల విమర్శ.

గతంలో యాదాద్రి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నంచిన కోమటిరెడ్డి భంగపడ్డారనేది పార్టీ నేతల్లో గుసగుసలు వినిపించాయి. తాజాగా తన సొంత పార్లమెంట్‌ నియోజకవర్గమైన భువనగిరి పరిధిలోని జనగామలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలలో పాల్గొనడానికి వచ్చిన కేసీఆర్‌తో కోమటిరెడ్డి ఆత్మీయంగా కలియ తిరిగారు. కేసీఆర్‌ కూడా కోమటిరెడ్డిని అక్కున చేర్చుకుని కౌగిలించుకున్నారు. మాటముచ్చట కలిపారు. అంతటితో ఆగకుండా అదే భువనగిరి నియోజకవర్గంలోని యాదాద్రాలో జరిగిన ప్రారంభోత్సవాలలో కూడా కోమటిరెడ్డి ఉత్సాహంగా పాల్గొని కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఆత్మీయ పలుకరింపులు, బోకేలు, కౌగిలింతలు చూస్తుంటే సగటు కాంగ్రెస్‌ కార్యకర్తలో అనుమాన బీజం పడడంతో తప్పులేదుగా? ఇప్పటికే వెంకటర్‌ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజుగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌తో డిటాచ్‌ అయ్యాడు. కమలం పట్టుకోవాలా?, గులాబీతో గుచ్చుకోవాలా? అన్న సందిగ్ధతతో ఉన్నారు. ఒకవైపు తమ్ముడు బీజేపీ వైపు చూస్తూనే, కాంగ్రెస్‌ కాడిని మోస్తున్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటర్‌ రెడ్డి మాత్రం కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్లు అంటున్నారు.

ఇక, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్కకు పీసీసీ రేవంత్‌ రెడ్డికి మధ్య కూడా అంత సయోధ్యలేదు. ఒకదశలో పీసీసీ ఆశించిన భట్టి.. పార్టీకీ వ్యతిరేకంగా మాట్లాడకున్నా, రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలిపై బహిరంగ విమర్శలు చేయకున్నప్పటికీ, లోలోపల మాత్రం రేవంత్‌ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్‌, కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. ఆచనువుతోనే దళితబంధుపై సమీక్ష జరిపిన నేపథ్యంలో భట్టిని పిలువడం.. ఆయన వెళ్లడం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి విమర్శలు సైతం ఎదుర్కోవల్సి వచ్చింది. ఈ క్రమంలోనే భట్టి సొంత నియోజకవర్గంలో ఓ మండలాన్ని కూడా దళితబంధు కోసం సెలెక్ట్‌ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవన్నీ చూస్తే ప్రగతిభవన్‌క భట్టికి పెద్ద దూర భారం లేదనే గుసగుసలు రేవంత్‌ వర్గం ప్రచారం చేస్తోంది.

మరో కీలక నేత, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. ఆయన కూడా పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అయినప్పటి నుంచి అంటిముట్టనట్లు ఉంటున్నారు. కాకపోతే కమిట్‌మెంట్‌ ఉన్న కాంగ్రెస్‌ నేత‌గా మంచి పేరు ఉంది. మాజీ అసెంబ్లీ స్పీకర్ అయిన తండ్రి శ్రీపాదరావు నుంచి మొదలుకుని ఇప్పటి వరకు పార్టీలైన్‌ తప్పిందిలేదు. వివాదరహితుడుగా, కేవలం నిర్మాణాత్మక విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యే శ్రీధర్‌బాబను సహజంగానే అందరూ గౌరవిస్తారు. మంత్రి కేటీఆర్‌ – శ్రీధర్‌బాబు రాజకీయ సమకాలికులు కాకపోయినప్పటికీ, కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నారు. నిర్మాణాత్మక ఆరోపణలు, విమర్శలు తప్ప కేసీఆర్‌, ఆయన కుటుంబంపై ఏనాడు శ్రీధర్‌బాబు నోరుపారేసుకోలేదు. శ్రీధర్‌బాబు సతీమణి శైలజాఅయ్యర్‌ ఐఎఎస్‌ అధికారి కావడం, ఆమె కీలకమైన పోస్ట్‌లలోనే ఉండడంతో శ్రీధర్‌బాబు కూడా కేసీఆర్‌కు సన్నిహితం అన్నట్లుగానే కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు సన్నిహిత వర్గం చెప్పే వాదన.

రేవంత్‌ రెడ్డి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ పార్టీలైన్‌లోనే శ్రీధర్‌బాబు వెళుతున్నారు. అయితే, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు టీఆర్‌ఎస్‌కు దూరం అవుతున్నట్లు సంకేతాలు, శ్రీధర్‌బాబు కేసీఆర్‌, కేటీఆర్‌‌కు సన్నిహితమనే సంకేతాలు కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో కేటీఆర్‌, శ్రీధర్‌బాబు అన్యోన్యంగా కలిసిపోయారు. శ్రీదర్‌బాబు వద్దకు కేటీఆర్‌ వచ్చి మరీ పలుకరించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. శ్రీధర్‌బాబు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సమీపంలోకి వచ్చి పలుకరించినపుడు ఆత్మీయంగా మాట్లాడడం మర్యాదగా ఉంటుందన్నారు. ఈక్రమంలోనే పెళ్లిలో కేటీఆర్‌తో ముచ్చటించినట్లు చెబుతున్నారు. పదవులకోసం, అధికారం కోసం దిగజారే స్వభావం తనది కాదని, తనకు తెలిసినవాళ్లకు తాను అంటే ఏమిటో తెలుసని శ్రీధర్‌బాబు ప్రచారాన్ని కొట్టిపారేశారు.

ఇక, మరో కీలక నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డికి రేవంత్‌ రెడ్డి అంటే ఒక్క క్షణం పడదు. ఆయన అంటే అసలు గిట్టదు. ఇంటా బయట రేవంత్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు. తొలినుంచి టీఆర్‌ఎస్‌ కోవర్ట్‌గా జగ్గారెడ్డిని రేవంత్‌ వర్గం చిత్రీకరించడం.. ఆయనకు ఏమాత్రం నచ్చదు. అందుకే రేవంత్‌ రెడ్డిపై బహిరంగంగా విరుచుకుపడుతుంటారు. ఆమథ్య సంగారెడ్డిలో ప్రారంభోత్సవాలు కేటీఆర్‌ వచ్చిన సందర్భంగా జగ్గారెడ్డి కలివిడి తిరిగారు. కేసీఆర్‌పై ఆయన కుటుంబంపై విమర్శలు ఘాటు కూడా తగ్గించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్ది జగ్గారెడ్డి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, జగ్గారెడ్డి ఇవేమి పట్టించుకోకుండా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతూనే రేవంత్‌ వర్గాన్ని ఒక కంటకనిపెడుతున్నారు. రేవంత్‌ వర్గం సామాజిక మాధ్యమాల్లో తనపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి రేవంత్‌ వర్గంపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ నలుగురు నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌కు దగ్గర కాకున్నా, ఈనలుగురిని కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరకు చేర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం భవిష్యత్తు రాజకీయాలను ఆవిష్కరిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని టార్గెట్‌ చేయడం, రాహుల్ గాంధీకి అనుకూలంగా వ్యాఖ్యానించడంతో తెలంగాణ రాజకీయాల రంగులు మారుతున్నట్లే కనిపిస్తోంది.

Read Also….  Bjp vs Trs: కేసీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పని చేయాలి.. బీజేపీ నేత షాకింగ్ సవాల్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu