Telangana Rains: బిగ్ అలెర్ట్.. 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన
తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చింది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రాష్ట్రానికి వాన కబురొచ్చింది. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తదుపరి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని.. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




