Rain Alert: చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
Southwest monsoon: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రిభువనగిరి, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. ఇప్పటికే అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లక్షలాది మంది వరదలకు ప్రభావితమయ్యారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..