ఈ క్రమంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీ కెమెరాల ద్వారా అక్రమార్కులకు వ్యతిరేకంగా డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులను ఆదేశించారు. ఏమైనా ఘటనలు జరిగితే వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు కూడా రక్షణ కవచాలను ధరించాలని కోరారు. అదే సమయంలో ఈరోజు బీహార్‌లోని కనీసం 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు.
భద్రత కట్టుదిట్టం
ఇదిలాఉంటే.. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను పరిగణలోకి తీసుకోని పలు ప్రాంతంల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీహార్‌లోని కైమూర్, భోజ్‌పూర్, బక్సర్, ఔరంగాబాద్, రోహ్తాస్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్, నవాడా, బెగుసరాయ్, లఖిసరాయ్, సరన్, వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని, గయా, ఖగారియా, జెహనాబాద్ లలో ఆంక్షలు విధించడంతోపాటు.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్‌లోని అన్ని సున్నితమైన సైనిక స్థావరాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేరళలో భారీగా పోలీసు బలగాల మోహరింపు..
ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి వెనకాడమని.. పోలీసు బలగాలను మోహరించామని కేరళ పోలీసులు ఆదివారం తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..