”మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు”.. కని, పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు

ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మానవత్వం కనిపించడం లేదు. స్వార్థం, అసహనం పెరిగిపోతున్నాయి. డబ్బు పిచ్చితో మనుషులు బంధాలను నాశనం చేసుకుంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు...

  • Ram Naramaneni
  • Publish Date - 7:35 pm, Sat, 27 February 21
''మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు".. కని, పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు

ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మానవత్వం కనిపించడం లేదు. స్వార్థం, అసహనం పెరిగిపోతున్నాయి. డబ్బు పిచ్చితో మనుషులు బంధాలను నాశనం చేసుకుంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి చివరి స్టేజీలో పట్టెడన్నం కూడా పెట్టలేకపోతున్నారు కొందరు కఠినాత్ములు. తాజాగా  కనిపెంచిన తల్లికి పట్టేడన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్‌ జిల్లా జంగిలిగొండ గ్రామంలో చోటు చేసుకుంది.

మహబూబాబాద్‌ మండలం జంగిలి గొండ గ్రామానికి చెందిన వెన్నం కమలమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. తమకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో సేద్యం చేస్తూ.. పిల్లలని పోషించి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఉన్నవ్యవసాయ భూమిని ఇద్దరు కుమారులైన వెంకన్న, యాదగిరిలకు చేరి 5 ఎకరాలు పంచి ఇచ్చింది. భర్త వీరయ్య 18 ఏళ్ల క్రితమే మరణించడంతో..పిల్లల ఆలనా పాలనా మొత్తం తల్లి కమలమ్మదే. అయితే, గత కొద్ది రోజుల నుండి తల్లి కమలమ్మను తమ ఇంటికి రానివ్వకుండా కుమారులిద్దరు ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆ తల్లి మహబూబాబాద్‌ పట్టణంలోని పోలీసులను ఆశ్రయించింది. తనను కుమారులు ఇంట్లోకి రానివ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని బోరున విలపించింది ఆతల్లి.

తన జీవితాన్ని ధారపోసి సంపాదించిన సొమ్మును తన స్వార్థాన్ని మర్చి కుమారుల చేతుల్లో పెట్టడమే ఆ తల్లి పాలిట శాపంగా మారింది. కాటికి కాళ్లు చాపే వయసులో పట్టెడన్నం కోసం ఎప్పుడూ చూడని పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సి పరిస్థితి వచ్చిందని ఆ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటోంది. తన లాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని, తనకు ఉండటానికి గూడు, తిండి కావాలని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

చూశారా ప్రస్తుత సమాజం ఎలా తయారయ్యిందో.. నవమాసాలు మోసి బిడ్డలను కన్నది. వారిని పాలిచ్చి పెంచింది. ప్రయోజకులను చేసింది. చివరికి వారి చేతే ఇంట్లో నుంచి గెంటివేయబడింది. అమ్మను దేవతగా భావించే దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకర విషయం.

Also Read:

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త

Co-WIN 2.0: కరోనా టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం? పూర్తి వివరాలు మీ కోసం