Singareni: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన బోర్డు
సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సింగరేణి అధికారులు. మార్చి 31 నుంచి రిటైర్ అయిన అందరికీ ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించారు. పదవీ విరమణ వయసును...

సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సింగరేణి అధికారులు. మార్చి 31 నుంచి రిటైర్ అయిన అందరికీ ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సంస్థ CMD N.శ్రీధర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన సింగరేణి బోర్డు సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను సింగరేణి పర్సనల్ డైరెక్టర్ N.బలరామ్ విడుదల చేశారు.
నూతన ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31న తర్వాత పదవీ విరమణ పొందిన ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 31లోగా విధుల్లో చేరాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగాల్లో చేరనిపక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని పేర్కొంది. పదవీ విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్కు- నో పేగా పరిగణిస్తామన్నారు. కానీ ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తించడం జరుగుతుందన్నారు. పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్‌ను నిలుపుదల చేసేలా CMPF అధికారులను సింగరేణి కోరనుంది.
నిబంధనలు..
తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగులు, అధికారులకు కోల్ మైన్స్ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సమగ్ర విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను కంపెనీ వ్యాప్తంగా అన్ని గనుల కార్యాలయాలు, నోటీసు బోర్డులపై కార్మికులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఈపీ ఆపరేటర్లు, ఎంవీ డ్రైవర్లు విధుల్లో చేరిన నెల రోజుల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ పెంపుతో ఇప్పటికే రిటైర్ అయిన 1,082 మంది ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 43,899 వేల మంది ఉద్యోగులు లబ్థి పొందుతున్నారు.
పదవీవిరమణపొంది.. గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ తీసుకున్న ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరిన 15 రోజుల్లో ఆ సొమ్మును కంపెనీకి చెల్లించాలని యాజమాన్యం స్పష్టంచేసింది. ఒకవేళ గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ సొమ్ము చెల్లించకపోతే క్యాష్ క్రెడిట్ రేట్ ప్రకారం వడ్డీని నెల నెలా జీతం నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
రిటైర్ అయిన తర్వాత మళ్లీ కార్డులు జారీ చేస్తామని యాజమాన్యం తెలియజేసింది. సీఎం కేసీఆర్, సింగరేణి సీ అండ్ ఎం.డి. శ్రీధర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి ఉన్నతికి మరింత అంకిత భావంతో పనిచేస్తామని సిబ్బంది పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..
