Mrigasira Karthi: మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తింటారు..? దాని వెనకాల హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయా?
AP - Telangana: మృగశిర నాడు ఘుమఘుమలాడించే చేపల వంటకాలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకీ మృగశిర కార్తె నాడు ఫిష్ తింటే రోగాలు ఫినిష్ అయిపోతాయా? ఇక ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటామా? బతుకుబండిని ఉల్లాసంగా ఉత్సాహంగా లాగించేస్తామా? దాని వెనకాల హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయా? ఉంటే అవేంటి? రండి తెలుసుకుందాం.
మృగశిర కార్తె సందర్భంగా చేపల పులుసు వాసన గాల్లో గుప్పుమంటోంది. జిహ్వ చేపల్యం.. చేపల కూర తినమంటోంది. యస్. మృగశిర కార్తె వచ్చింది. నోరూరించే చేపల పండగ తెచ్చింది. మృగశిర కార్తె వచ్చిందంటే చేపల కూర తినాల్సిందే. మృగశిర కార్తె సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఫిష్ మార్కెట్‌కి పోటెత్తారు జనం. తాజా చేపల ఘుమఘుమలతో మృగశిర కార్తెను ఎంజాయ్ చేస్తున్నారు. తొలకరి జల్లులు పలకరించే ముందు వచ్చే మృగశిర కార్తె రోజు దాదాపు ప్రతి ఇంటా చేప కూర ఉడకాల్సిందే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపలు కొనడానికి జనం క్యూ కట్టారు. రహు, మెట్ట, బొచ్చ, బంగారు తీగ లాంటి చేపలకు గిరాకీ భారీగా పెరిగింది.
మృగశిర కార్తె రోజు చేప కూర తింటే ఏడాదంతా ఆరోగ్యం మనచెంతే ఉంటుందన్నది పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. అందుకే హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో చేపల కోసం జనం క్యూ కడుతున్నారు. వరంగల్‌లో కూడా చేపల రేట్లకు రెక్కలు వచ్చాయి. చేపలు తినాలనే సెంటిమెంట్ తో జనం మార్కెట్ కు పరుగులు తీస్తుంటే ఇదే అదునుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. ఇక మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ పెస్టివల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు మంత్రి తలసాని.
మృగశిర కార్తెలో చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామనేది నమ్మకం. ఫిష్ తింటే రోగాలు ఫినిష్ అయిపోతాయని జనం నమ్ముతారు. వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె ప్రారంభమైంది. ఇన్నాళ్లు వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ జనం ఈ కార్తెలో కురిసే తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతారు. వాతావరణం ఒక్కసారి చల్లబడడం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎండాకాలం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో బాడీలో వేడిని పెంచేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతారు. వర్షాకాలం మొదలైతే అంటువ్యాధులు కూడా మొదలవుతాయి. చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటామని భావిస్తారు. ఈ సీజన్‌లో చేపలను తింటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందనే నమ్మకం ఉంది.
ఇక చేపల్లో కొరమీను చేపకు ప్రత్యేకత ఉంది. కొరమీను పులుసు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓసారి రుచి చూస్తే తప్ప ఆ మజా ఏంటో అర్ధం కాదు. ఈ చేపలో విటమిన్ A, Dలతో పాటు ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి . మంచి రుచిగా ఉండే ఈ చేపల మాంసం తేలిగ్గా జీర్ణమవుతుంది. సర్జరీల తర్వాత ఈ చేపను తింటే గాయం త్వరగా మానుతుందని చెబుతారు. ఇక బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంలో కూడా కొరమీను పిల్లలనే ఉపయోగిస్తారు. మృగశిర కార్తెలో చేపలు తినే ఆచారం…ఆహారపు అలవాటుగా మారడం వెనుక ఇంత సైన్స్ ఉందంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.