Telangana: టైగర్ రిటర్న్స్.. ఇలాగే వెళ్లింది..! నిర్మల్ జిల్లాలో మళ్లీ బెబ్బులి భయం

అటవీ ప్రాంతానికి అరకిలోమీటర్ మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని దండోరా చాటింపు వేస్తూ పులి సంచార గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పులి ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుందని.. పర్యావరణ సమతుల్యత కొనసాగుతుందని.. అడవి పందుల బెడద రైతులకు తప్పుతుందంటున్నారు అటవీ అధికారులు.

Telangana: టైగర్ రిటర్న్స్.. ఇలాగే వెళ్లింది..! నిర్మల్ జిల్లాలో మళ్లీ బెబ్బులి భయం
Tiger Wandering In Kuntala
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 10, 2024 | 4:45 PM

నిర్మల్ జిల్లాలో బెబ్బులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పది రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెబ్బులి సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. సారంగపూర్ , నర్సపూర్ , కుంటాల మండలాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. పశువుల మంద మీద దాడి చేసి మూడు పశువులను హతమార్చింది. పులి దాడి నేపథ్యంలో అలర్ట్ అయిన అటవిశాఖ ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచింది‌. ఎప్పుడు ఎటు వైపు నుండి‌ వచ్చి దాడి‌ చేస్తుందో తెలియక పశువుల కాపారులు, రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే వలస వచ్చిన పులిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అటవిశాఖ చెమటోడుస్తోంది.

నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ , కుంటాల, నర్సాపూర్ మండలాల పరిదిలో సంచరిస్తున్న బెబ్బులి పదికి పైగా గ్రామాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. జిల్లాలో ని మూడు మండలాల ప్రజలను మూడు వారాలుగా ముప్పు‌ తిప్పలు పెట్టిన బెబ్బులి.. బైంసా డివిజన్ రేంజ్ లోని సూర్యపూర్ నుండి బార్డర్ దాటి మహారాష్ట్ర అప్పారావ్ పేట్ పారెస్ట్ లోకి వెళ్లిపోయింది. అమ్మయ్యా బెబ్బులి టెన్షన్ తప్పిందని మూడు మండలాల జనం ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ నేనొచ్చాశానంటూ పాదముద్రలతో కబురంపింది బెబ్బులి.

మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరం లోని అప్పారావుపేట్ బీట్ పరిధి వైపు గురువారం ఆనవాళ్లు కనిపించడంతో.. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటే వీలుందని ఇక్కడి అధికారులు మహారాష్ట్ర ఎస్ఆర్వో, అధికారు లకు పులి సంరక్షణ బాధ్యతలను అప్పగించేందుకు నివేదికలు రూపొందించారు. హమ్మయ్య పులి వెళ్లిందని ఊపిరిపీల్చుకున్న తరుణంలో శుక్రవారం మళ్లీ కుంటాల, హన్మాన్ నగర్ తండా ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది బెబ్బులి. ఈ బెబ్బులి వయస్సు 6 ఏళ్ల పైగానే ఉంటుందని.. మహారాష్ట్రాలోని పెనుగంగా టైగర్ జోన్ లో సంచరించే జాని టైగర్ గా గుర్తించామని తెలిపారు బైంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్. మహారాష్ట్ర లోకి వెళ్లి పోయి మళ్లీ బైంసా డివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెబ్బులి హన్మాన్ తండా మీదుగా ప్రాథమిక పాఠశాల వెనక వైపు నుంచి అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పేర్కొన్నారు ఎఫ్ఆర్వో. అడవంతా నాదే అన్నట్టుగా బైంసా డివిజన్ లోని అటవి ప్రాంతంలో బెబ్బులి సంచారం కొనసాగుతోంది. నర్సాపూర్ ( జి ) అడవుల్లో ఆరు బృందాలు , 15 ట్రాప్ కెమెరాలతో టైగర్ కోసం సేవ్ టైగర్ ఆపరేషన్ కొనసాగిస్తోంది అటవిశాఖ.

ఇవి కూడా చదవండి

అంజనీతండా శివారు గొల్లమాడ అటవి ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ.. నర్సాపూర్ ( జి ) మండలం అంజనీ తండా అటవీప్రాంతం నుంచి రాంపూర్, దిలావర్పూర్, మాడేగాం, కాల్వ అటవీ వైపు పులి కదలికలు ఉన్నట్టుగా తేల్చారు‌. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన పులి ఆరున్నరేళ్ల జానీ గా గుర్తించినట్లు తెలిపింది అటవిశాఖ.

గత పది రోజుల క్రితం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి తండాలో ఆడే మోహన్ అనే వ్యక్తికి చెందిన రెండు గొర్రెలు, అశోక్ అనే వ్యక్తికి చెందిన ఒక ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. అక్కడి నుండి కుంటాల మండలం సూర్యాపూర్ అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన బెబ్బులి పశువుల మందపై దాడి చేసి కోడె దూడను హతమార్చింది. అలర్ట్ అయిన అటవిశాఖ అదికారులు పులి కోసం ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేయగా… పలుమార్లు ఆవు కళేబరాన్ని తినేందుకు వచ్చి ట్రాప్ కెమెరాకు చిక్కింది.. గత ఆదివారం సూర్యాపూర్ గ్రామస్తులు మేత కోసం పశువులను అడవిలోకి తీసుకెళ్లగా అటవి సరిహద్దు ప్రాంతంలోని చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన పెద్దపులి కంటపడటంతో పశువులు బెదిరి నీటిలోకి పరుగులు తీశాయి. కాపరులు కుంటి రాములు, దొంతుల చిన్నయ్య చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో వైపు‌ కుంటాల మండలంలోని అంబుగామ అటవీ ప్రాంతం పీర్ల గుట్టలో ఆవుపై దాడిచేసి గాయపరిచింది.

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్, అంబుగామ అటవీ ప్రాంతాల్లో వారం రోజులుగా పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. పదిహేను రోజుల క్రితం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందిడి, కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన బెబ్బులి..ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు మీదుగా బోథ్ మండలంలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి తండా నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట్ మీదుగా నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్ ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడికి పాల్పడింది. ఆరు సంవత్సరాల పైన ఉన్న మగ బెబ్బులిగా గుర్తించిన అటవిశాఖ అధికారులు, మహారాష్ట్ర అటవిశాఖ అధికారుల సహాకారంతో ఆ బెబ్బులిని ట్రాక్ చేస్తున్నారు.

అయితే, జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయం 9 గంటలకు వెళ్లి 4 గంటలలోపు పనులు ముగించుకోవాలని సూచించారు. కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని కోరారు. అటవీ ప్రాంతానికి అరకిలోమీటర్ మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని దండోరా చాటింపు వేస్తూ పులి సంచార గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పులి ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుందని.. పర్యావరణ సమతుల్యత కొనసాగుతుందని.. అడవి పందుల బెడద రైతులకు తప్పుతుందంటున్నారు అటవీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి