ఇది కదా కావాల్సింది.. పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి పంచాయతీలకు నిధులను బదిలీ చేసింది. గ్రామ స్థాయి అభివృద్ధి పనులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోకుండా కొనసాగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకునే అవకాశం పంచాయతీలకు లభించనుంది. పండుగ వేళ నిధుల విడుదల గ్రామాల్లో ఉత్సాహాన్ని పెంచిందని అధికారులు పేర్కొంటున్నారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నిధులు అందడం ద్వారా గ్రామ పాలనకు స్థిరమైన ఆరంభం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని పంచాయతీలకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులపైనే ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఈ నిధుల విడుదలకు సంబంధించి సోమవారం ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిధుల విడుదల విధానం, ఖర్చు నియమాలు, పర్యవేక్షణ వ్యవస్థపై ఈ సమావేశంలో చర్చించారు. పంచాయతీ స్థాయిలో నిధుల వినియోగంపై ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశలను నెరవేర్చేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గ్రామాల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
