10 సిక్సులు.. 7 ఫోర్లుతో వైభవ్ విధ్వంసం.. కీలక పోరులో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..
కీలక మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. 221 రన్స్ టార్గెట్‌ను సునామీ బ్యాటింగ్‌తో ఈజీగా ఊదిపారేశాడు. కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 93 పరుగులు చేసిన సూర్యవంశీ.. లక్నో బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.

ఐపీఎల్ 2026 లీగ్ దశ క్లైమాక్స్‌లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊదిపారేశారు. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మిచెల్ మార్ష్ భారీ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతనికి తోడుగా జోష్ ఇంగ్లిస్ (60 రన్స్, 29 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో యశ్ పుంజా 2 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జైపూర్ స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 38 బంతులు ఆడిన సూర్యవంశీ.. 7 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి లక్నో దుమ్ముదులిపాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (43) సాలిడ్ సపోర్ట్ ఇచ్చాడు. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ను ముగించాడు. దీనితో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
