AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు

పరీక్షా పత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా అరెస్టు అయ్యిన విద్యార్థులకు సుప్రీంకోర్టు కీలక ఊరటనిచ్చింది. 18 ఏళ్లలోపు విద్యార్థులను, అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి తదుపరి విచారణ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court On Students Protests
Balaraju Goud
|

Updated on: Jul 28, 2026 | 1:27 PM

Share

పరీక్షా పత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా అరెస్టు అయ్యిన విద్యార్థులకు సుప్రీంకోర్టు కీలక ఊరటనిచ్చింది. 18 ఏళ్లలోపు విద్యార్థులను, అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి తదుపరి విచారణ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం (జూలై 28) ఈ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ రక్షణ నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు వర్తించదని స్పష్టంచేసింది. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీతో విచారణ జరిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నిరసనల సందర్భంగా పోలీసు సిబ్బందిపై జరిగిన దాడుల ఆరోపణలను విచారణ పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 20న పార్లమెంట్‌కు విద్యార్థులు చేపట్టిన మార్చ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఘర్షణలు, అలాగే పలు రాష్ట్రాల్లో నిరసనలను అణచివేసే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను కోర్టు విచారిస్తోంది.

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, “పూర్తిగా స్వతంత్ర విచారణ జరగాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారు ఎవరైనా సరే, వారిపై చర్యలు తప్పనిసరిగా ఉండాలి. బాధ్యతను నిర్ధారించకుండా విచారణకు అర్థం ఉండదు” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై కీలక న్యాయపరమైన పరిణామంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us