AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8వ తరగతితోనే చదువుకు పుల్‌స్టాప్‌.. 76 ఏళ్లకు మళ్లీ మొదలుపెట్టి 85కి MA పూర్తి చేసిన తాతగారు!

చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదని హర్యానాకు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ సైనికుడు లాల్ చంద్ గోదార్ నిరూపించారు. చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి సైన్యంలో చేరిన ఆయన.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఏకంగా 76 ఏళ్ల వయసులో మళ్లీ చదువు ప్రారంభించి, ఇప్పుడు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.

8వ తరగతితోనే చదువుకు పుల్‌స్టాప్‌.. 76 ఏళ్లకు మళ్లీ మొదలుపెట్టి 85కి MA పూర్తి చేసిన తాతగారు!
Retired Army Soldier Lal Chand Godara Ma Story
Srilakshmi C
|

Updated on: Sep 25, 2026 | 8:16 PM

Share

లాల్ చంద్ గోదార్ చిన్నతనంలోనే కుటుంబ పరిస్థితులు, జీవితంలోని ఇతర కారణాల వల్ల 8వ తరగతిలో చదువు మానేశారు. అనంతరం 1961-62 ప్రాంతంలో భారత సైన్యంలో చేరారు. తన సైనిక జీవితంలో 1962లో చైనాతో జరిగిన యుద్ధంతో పాటు 1965, 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లోనూ సేవలందించారు. అయితే 10వ తరగతి పూర్తి చేయకపోవడంతో సైన్యంలో ఆయనకు పదోన్నతులు లభించలేదు. ఆ తర్వాత హర్యానా రవాణా శాఖలో యార్డ్ మాస్టర్‌గా పనిచేశారు. బస్సుల కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వహించిన ఆయన.. 2002లో ఉద్యోగ విరమణ చేశారు.

76 ఏళ్ల వయసులో మళ్లీ చదువు ప్రారంభం

చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అంటే గోదార్‌కు ఎంతో ఇష్టం. అయితే పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ ఆసక్తి అలాగే కొనసాగింది. ఈ క్రమంలో ఆయన మనవళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో 76 ఏళ్ల వయసులో మళ్లీ చదువుకోవడం ప్రారంభించారు. ఇంట్లోనే చదువుకుంటూ, తన కుటుంబ సభ్యుల సహకారంతో విద్యను కొనసాగించారు. 2023లో ఆయన బీఏ డిగ్రీని పూర్తి చేశారు. అక్కడితో ఆగకుండా.. ఇప్పుడు తన మొదటి ప్రయత్నంలోనే ఎంఏ డిగ్రీని కూడా విజయవంతంగా పూర్తి చేశారు.

‘తాతను చూసి ఎంతో గర్వంగా ఉంది’..

గోదార్ చదువులో తన మనవరాలు నవ్య కూడా కీలకంగా సహకరించారు. ప్రతిరోజూ గంటల తరబడి తన తాత చదువుకునేవారని, కష్టంగా అనిపించిన విషయాల్లో తాను సహాయం చేసేదానినని నవ్య తెలిపారు. ‘మా తాతగారు ప్రతిరోజూ గంటల తరబడి చదువుకునేవారు. ఆయనకు కష్టంగా అనిపించినప్పుడు నేను సహాయం చేసేదాన్ని. అందుకే ఆయన చదువును కొనసాగించాలని కోరుకున్నాను. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆయనను చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది; అని నవ్య పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

‘దేశం కోసం యుద్ధాలు చేశాను.. చదువుకోవడం కష్టం కాదు’

ఎలాంటి ప్రత్యేక కోచింగ్ తీసుకోకుండా, తన మనవరాలి సహాయంతో ఇంట్లోనే చదువుకుని పరీక్షలకు సిద్ధమయ్యారు గోదార్. తన విజయంపై ఆయన ఎంతో సాదాసీదాగా స్పందించారు. ‘నేను దేశం కోసం యుద్ధాలు చేశాను. చదువుకోవడం నాకు అంత కష్టమైన పని కాదు’ అంటూ నవ్వుతూ చెప్పారు. ఆయన మాటలు చదువుపై ఉన్న పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. 85 ఏళ్ల వయసులోనూ గోదార్ తన రోజువారీ జీవితంలో చురుకుగా ఉంటున్నారు. ప్రతిరోజూ కొంత దూరం నడవడంతో పాటు సైకిల్ కూడా తొక్కుతుంటారు. వయసు పెరిగినా నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన భవిష్యత్తులో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడం లేదా ఎల్‌ఎల్‌బీ చదవడం గురించి ఆలోచిస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏ దశలోనైనా కొత్త లక్ష్యాలను చేరుకోవచ్చని లాల్ చంద్ గోదార్ ప్రయాణం చెబుతోంది.

Follow Us