Medaram Maha Jatara: దారులన్నీ మేడారం వైపే.. మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రెండు కోట్ల మంది భక్తుల కోసం రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఫిబ్రవరి 18న సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్‌డేట్స్ మొబైల్ యాప్, వెబ్‌సైట్, చాట్‌బాట్ అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క–సారలమ్మ మహా మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జాతర నిర్వహణ, ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు అన్ని శాఖల కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కోసం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల భక్తులు మేడారానికి తరలివస్తారని తెలిపారు. ఈసారి సుమారు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాతో అన్ని శాఖలు సమన్వయంతో సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మక్క–సారలమ్మ తల్లులతో ఎంతో భావోద్వేగ బంధం ఉందని మంత్రి అన్నారు. అందుకే రూ.260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి వచ్చి నూతన ఆలయాన్ని ప్రారంభించనున్నారని, అదే రోజు అక్కడే క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా మేడారానికి తరలివస్తుందని తెలిపారు. భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సంప్రదాయ భక్తులు కనీసం మూడు రోజుల పాటు మేడారంలో బస చేస్తారని, వారికి అవసరమైన వసతి, తాగునీరు, శానిటేషన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
రవాణా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో వస్తారని, ఆ రూట్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక నిఘా పెంచాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని, మరో వెయ్యేళ్ల పాటు నిలిచేలా మేడారం ఆలయం నిర్మించామని మంత్రి సీతక్క తెలిపారు. విస్తరించిన రోడ్లు, ఆధునికంగా రూపుదిద్దుకున్న జంక్షన్లు, ఆదివాసీ చరిత్రను ప్రతిబింబించేలా చేసిన ఏర్పాట్లు జాతర ప్రత్యేకతగా నిలుస్తాయని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం మేడారం జాతర మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్, మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన అన్ని కీలక సమాచారం ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుందని స్పష్టం చేశారు.
మేడారం జాతర మొబైల్ యాప్: https://play.google.com/store/apps/details?id=com.itprofound.medaramjathara
మేడారం జాతర అఫిషియల్ వెబ్‌సైట్: https://medaramjathara2026.com
MyMedaram WhatsApp Chatbot: 📱 WhatsApp Number: 7658912300
ఈ యాప్, వెబ్‌సైట్, చాట్‌బాట్‌లలో , రూట్ మ్యాప్‌లు, టాయిలెట్ బ్లాక్‌ల లొకేషన్లు, ,మెడికల్ క్యాంపుల వివరాలు, ,ట్రాఫిక్ అప్‌డేట్స్, ,హెల్ప్‌డెస్క్ నంబర్లు, ,జాతర చరిత్ర, ఫిర్యాదు నమోదు వ్యవస్థ, మిస్సింగ్ పర్సన్ సమాచారం, తాగునీటి వసతులు సహా అన్ని వివరాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మేడారం మహాజాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
