Medak Blood Donor: ఒక్క ఫోన్ కాల్‌తో ప్రాణదాతగా మారుతున్న యువకుడు.. సొంత ఖర్చుతో రక్తదానం!
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎవరికి రక్తం అవసరం ఉందని తెలిసినా ఫోన్ చేసిన వెంటనే అక్కడికి చేరుకొని రక్తదానం చేసేస్తాడు. తన లాగే రక్త దానం చేసే వ్యక్తులందరిని ఒకచోట చేర్చి, సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్ అనే ఒక గ్రూపుని ఏర్పాటు చేసి..
ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు, ఏకంగా 100 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడి యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన ఒక్క ఫోన్ కాల్ చేస్తే రక్తదానం చేస్తున్న ఓ వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే ఈ వ్యక్తి పేరు అనిల్. ఇతను ఇప్పటివరకు దాదాపు 100 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు. గత పది సంవత్సరాల క్రితం తన తండ్రికి అత్యవసర సమయంలో రక్తం అవసరమైనప్పుడు రక్తం దానం చేసే రక్త దాతలు గాని అవసరమైన రక్తం గాని అందుబాటులో లేకపోవడంతో తన తండ్రి గోపీనాథ్ పిళ్లై ను పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి అతడు తనకు వీలైనంత వరకు ఇతరులకు రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని ఆ ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాడు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎవరికి రక్తం అవసరం ఉందని తెలిసినా ఫోన్ చేసిన వెంటనే అక్కడికి చేరుకొని రక్తదానం చేసేస్తాడు. తన లాగే రక్త దానం చేసే వ్యక్తులందరిని ఒకచోట చేర్చి, సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్ అనే ఒక గ్రూపుని ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపు ఇప్పటివరకు కొన్ని వందల మందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలిచాడు. ఇతడి సేవలను గుర్తించిన రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ రక్తదాతగా అవార్డు ప్రకటించి మాజీ గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.
జిల్లా కేంద్రంలోని కోర్టులో విధులు నిర్వహిస్తాడు ఇతను. అవసరమైనప్పుడు సంగారెడ్డి లోనే కాక హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సైతం తన సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి రక్తదానం చేసి వస్తాడు.. ఒక్కసారి మనం చేసే రక్తదానం మూడు ప్రాణాలను కాపాడుతుందని. వీలయినంతవరకు రక్తదానం చేయాలని రక్తదానం చేయడం వల్ల మనిషి ఉత్సాహవంతంగా ఉంటాడని ఆరోగ్యంగా ఉంటాడని యువతకి రక్తదానం పై అవగాహన కల్పిస్తూ ఉంటాడు. తను చేసే సేవా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది అధికారుల నుండి ప్రశంసలు రివార్డులు, అవార్డులను సైతం పొందాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..