Telangana: ‘చిత్రం’ లేపిన వివాదం.. అక్కడ ఆ ఫోటోను ఎందుకు పెట్టారంటూ..
Telangana: తెలంగాణలో నిత్యం ఏదో ఒక అంశం రాజకీయ వివాదాంశం అవుతూనే ఉంది. తాజా ఓ ఫోటో పొలిటికల్ ఇష్యూగా మారింది.
Telangana: తెలంగాణలో నిత్యం ఏదో ఒక అంశం రాజకీయ వివాదాంశం అవుతూనే ఉంది. తాజా ఓ ఫోటో పొలిటికల్ ఇష్యూగా మారింది. ఆ ఫోటోను వెంటనే తొలగించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరిది ఆ ఫోటో? ఏంటా వివాదం? ఇప్పుడు తెలుసుకుందాం. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతదేశంలోని 75 మంది ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్‌ల చిత్రపటాలతో కూడిన ఓ ప్రత్యేక గ్యాలరీని హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రారంభించారు. అయితే, మ్యూజియంలో ఆవిష్కరించిన 75 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోల్లో సావర్కర్ ఫోటో కూడా ఉంది. ఇదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. సావర్కర్ చిత్ర పటాన్ని ఇక్కడెలా పెడతారంటూ ఫైర్ అవుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. బుధవారం నాడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు.. మ్యూజియం నిర్వాహకులు ఆవిష్కరించిన ఫోటోలను వారు సందర్శించారు. అయితే, ఆ ఫోటోల్లో సావర్కర్ ఫోటో కనిపించడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు కాంగ్రెస్ నాయకులు.
టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ ఉస్మాన్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. మ్యూజియంలో సావర్కర్ ఫోటో పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. సావర్కర్ ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటం భాగస్వామ్యం కాలేదని, అలాంటి వ్యక్తి ఫోటోను సాలార్‌జంగ్ మ్యూజియంలో ఎలా పెడతారంతూ అధికారులను నిలదీశారు ఖాన్. ఈ చిత్రపటాన్ని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఎలా ఆవిష్కరిస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. గాంధీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సావర్కర్ ఫోటోను మ్యూజియంలో ఏర్పాటు చేసి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? అని అధికారులను ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు. అయితే, ఈ అంశంలో వివాదం మరింత ముదురుతుండటంతో మ్యూజియం అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే భారత దేశానికి చెందిన 75 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగిందని వివరణ ఇచ్చారు. ఇందులో సావర్కర్ ఫోటో కూడా ఉందని చెప్పారు.
-నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు