TELANGANA POLITICS: ఆసక్తిరేపుతున్న తెలంగాణ రాజకీయం.. బరిలో పది దాకా పార్టీలు.. స్వల్ప తేడాతో గెలుపోటములు తారుమారయ్యే ఛాన్స్

చాపకింద నీరులా మరికొన్ని పార్టీలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాయి. ఏకంగా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయినా.. తమ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వుండాల్సిందేనన్న సంకల్పంతో...

TELANGANA POLITICS: ఆసక్తిరేపుతున్న తెలంగాణ రాజకీయం.. బరిలో పది దాకా పార్టీలు.. స్వల్ప తేడాతో గెలుపోటములు తారుమారయ్యే ఛాన్స్
Political
Follow us

|

Updated on: May 25, 2022 | 6:06 PM

TELANGANA POLITICS BECOMING INTERESTING AS MANY SMALL PARTIES IN FRAME: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతోందా ? కేవలం ప్రధాన రాజకీయ పార్టీలే కాకుండా అయిదారు పార్టీలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్న సంకేతాల నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు రాజకీయ పార్టీలు.. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY) దూకుడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఈసారి ఎలాగైనా ఓడించి అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వ్యూహాలకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణను కూడా వేగంగా అమలు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ పార్టీలకు ధీటుగా మాటలకు, చేతలకు పని చెబుతోంది అధికార టీఆర్ఎస్. ఇదంతా ప్రధాన రాజకీయ స్రవంతిని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ, చాపకింద నీరులా మరికొన్ని పార్టీలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో (TELANGANA ASSEMBLY ELECTIONS 2023) సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాయి. ఏకంగా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయినా.. తమ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వుండాల్సిందేనన్న సంకల్పంతో కొన్ని పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇందులో వైఎస్ షర్మిల (YS SHARMILA)-వైఎస్ఆర్టీపీ (YSRTP0, పవన్ కల్యాణ్ (PAWAN KALYAN)-జనసేన పార్టీ (JANASENA PARTY), ప్రవీణ్ కుమార్ (PRAVEEN KUMAR)-బీఎస్పీ (BSP), ప్రొఫెసర్ కోదండరామ్ (PROF KODANDARAM)-తెలంగాణ జన సమితి (TJS), కే.ఎ.పాల్ (K A PAUL)-ప్రజా శాంతి పార్టీలతోపాటు ఢిల్లీ, పంజాబ్ మీదుగా తెలంగాణకు చేరాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAM ADMI PARTY) వున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ కూడా తాను బరిలో వున్నానంటోంది.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP_లో చిరకాలం కొనసాగి, కారణాలేవైతేనే తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS RAJASHEKHAR REDDY), తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JAGAN MOHAN REDDY)లకు బాగా కలిసి వచ్చిన పాదయాత్రే తనకు కలిసి వస్తుందన్న నమ్మకంతో షర్మిల పాదయాత్ర ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఆమె వేయి కిలోమీటర్ల నడక పూర్తి చేశారు. నిజానికి పదేళ్ళ క్రితం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయినపుడు అంతకు ముందు ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రని షర్మిల ఏపీలో కొనసాగించారు. ఇపుడు అదే అస్త్రాన్ని తెలంగాణాలో ప్రయోగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ.. తనకు ఛాన్సిస్తే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెబుతున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ మాజీ నేతలు, వైఎస్ అభిమానులు నడుస్తున్నారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ.. షర్మిల ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ సమీప జిల్లాలపైనే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుచుకునే వ్యూహంతో షర్మిల కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఎన్నికల్లో ఏపీకే పరిమితమైన జనసేన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 30 నుంచి 40 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా తెలంగాణలో పోటీ గురించి ప్రకటన చేశారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలని పవన్ భావించినప్పటికీ.. తెలంగాణ బీజేపీ నేతల సూచన మేరకు ఆయన వెనక్కి తగ్గారు. కానీ ఈసారి తెలంగాణ అసెంబ్లీలో తమ పార్టీకి ప్రాతినిధ్యం వుండాలని భావిస్తున్న పీకే.. 30 నుంచి 40 సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే.. ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్.. తెలంగాణలోను ఆ పార్టీని కలుపుకుని వెళతారా లేక సింగిల్‌గా బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి వుంది. ఒకవేళ బీజేపీతో జతకడితే జనసేనతో కలిసి పోటీ చేయడం ద్వారా ఆంధ్రా ముద్రని వేయించుకునేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్దమవుతారా అన్నది ఆసక్తి రేపే ప్రశ్న. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దన్న సంకల్పంతో పవన్ కల్యాణ్ ఏపీలో చంద్రబాబుతో కూడా జతకట్టబోతుండడంతో ఆయన పట్ల తెలంగాణ బీజేపీ నేతల వైఖరి ఎలా వుంటుందన్నది తేలాల్సి వుంది.

తన ఐపీఎస్ అధికారి హోదాను వదులుకుని మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రవీణ్ కుమార్. సర్వీసు చివరి రోజుల్లో గురుకుల పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు పని చేసిన ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బహుజనసమాజ్ పార్టీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పలు జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ దళితలకు రాజ్యాధికారం రావాలని పిలుపునిస్తున్నారు. బీఎస్పీని అధికారంలోకి తెస్తానంటున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో కలిసి పని చేసి.. తీరా రాష్ట్రం వచ్చాక ఆయనకు దూరమై సొంత కుంపటి పెట్టుకున్న రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్ తాను స్థాపించిన తెలంగాణ జన సమితి పక్షాన బరిలోకి దిగుతున్నారు. అయితే.. ఈ పార్టీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో జనసమితిని మూసేసి తమ పార్టీలో చేరాని కోదండరామ్‌ను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతల ఆహ్వానాన్ని మన్నించి ఆయన వారి పార్టీలో చేరతారా లేక జన సమితి బ్యానర్‌లోనే వచ్చే ఎన్నికల్లో తలపడతారా అన్నది తేలాలి. అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరకపోయినా కోదండరామ్ కానీ, ఆయన పార్టీ గానీ పోటీ చేసే కొన్ని చోట్ల కాంగ్రెస్ మద్దతునిచ్చే అవకాశం వుంది. ఇక్కడ ఇంకో అంశం కూడా క్లారిటీ రావాల్సి వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమిలో టీడీపీ కూడా వుంది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ మినుకుమినుకుమంటోంది. అది పూర్తిగా ఆరిపోతుందా.. లేదా పొత్తుల రాజకీయంతో ఒకటో రెండో స్థానాల్లో కలబడి నిలబడుతుందా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఇక ఏపీకి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు కే.ఏ.పాల్ కూడా తాను స్థాపించిన ప్రజా శాంతి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనో, కాంగ్రెస్ పార్టీనో ప్రత్యామ్నాయం కాదని, కేవలం తన ప్రజా శాంతి పార్టీనే కేసీఆర్ పార్టీని ఓడించగలదని టీవీ ఇంటర్వ్యూల్లో ప్రకటించేసుకున్నారు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున రుణాలిప్పించే సత్తా వుందని ఆయన నమ్మబలుకుతున్నారు.

ఇక ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఖంగుతినిపించి మరీ అధికారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తర్వాత పంజాబ్‌లోను చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్‌లో సాధించిన ఘన విజయం తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణపై దృష్టి సారించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం సాధించే లక్ష్యంతో ఇక్కడ పోటీకి సిద్దమవుతున్నారని అంటున్నారు. ఆయన కూడా ప్రొ. కోదండరామ్‌ని తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ కూడా బరిలోకి దిగబోతోంది. తెలంగాణ ఇంటి పార్టీ వుండనే వుంది. మొత్తమ్మీద తెలంగాణలో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఆరేడు పార్టీలు బరిలోకి దిగే అవకాశం వుంది. అయితే.. ఈ చిన్నా చితకా పార్టీలు ఎన్నికల్లో ఢంకా బజాయించి.. అధికారం చేపట్టే స్థాయి మేజిక్ ఫిగర్‌ని సాధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ.. తమకు పట్టున్న ఏరియాల్లోను, నియోజకవర్గాల్లోను చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాబట్టుకుంటే అవి అక్కడ తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమాతో వున్న మూడు ప్రధాన పార్టీలకు ఎంతో కొంత గండి కొట్టే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఇదే జరిగితే విజయావకాశాలను ఈ చిన్నా చితకా పార్టీలు ప్రభావితం చేయడం ఖాయం. ఇలాంటి సందర్భంలో ఒక్కో సీటు కీలకమైతే, ఒక్కో ఓట్ల శాతం ముఖ్యమైతే.. చిన్న పార్టీలను కలుపుకుని పోయే పెద్ద పార్టీకి మేజిక్ ఫిగర్‌ చేరుకోవడం కాసింత ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.