AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల.. రిజిస్ట్రేషన్లు డబుల్.. ఏడింతలు పెరిగిన ఆదాయం

తెలంగాణలో రాష్ట్ర ఖజానా నిండుతోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేళ్ళలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

Telangana: రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల.. రిజిస్ట్రేషన్లు డబుల్.. ఏడింతలు పెరిగిన ఆదాయం
Telangana Registration And Stamp Department
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 29, 2024 | 4:52 PM

Share

తెలంగాణలో రాష్ట్ర ఖజానా నిండుతోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేళ్ళలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,746 కోట్లు ఉంటే.. 2023–24కు వచ్చేసరికి రూ.14,588 కోట్లకు చేరింది. ఒక్క కరోనా ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాది ఆదాయంలో వృద్ధి కనిపించింది. అదే డాక్యుమెంట్ల విషయానికొస్తే అప్పుడు 8.27 లక్షలు రిజిస్ట్రేషన్ కాగా.. గతేడాదికి ఆ మొత్తం 18.41 లక్షలకు చేరాయి.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్‌మెంట్ వార్షిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం పోయిన ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అంతకు ముందు సంవత్సరం (2022–23)తో చూస్తే అగ్రికల్చర్ డాక్యుమెంట్లు లక్ష మేర తగ్గాయి. అదే నాన్ అగ్రికల్చర్ విషయానికొస్తే పెద్దగా మార్పు లేదు. గత సంవత్సరం నాన్ అగ్రికల్చర్ పరిధిలోని ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్లు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 10.50 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షలు ఓపెన్ ప్లాట్ల ద్వారా క్రయవిక్రయాలు జరిగాయి. ఇందులో 1.03 లక్షలు ఇండ్లకు, ఫ్లాట్లకు 94,884, ఇక అగ్రికల్చర్లో 4.60 లక్షల సేల్ డీడ్స్ చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్ ఫ్లేస్‌లో ఉంది. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2023–24లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి రూ.4798 కోట్లు వచ్చాయి. ఇక అత్యల్పంగా ఆదాయం వచ్చిన దాంట్లో రూ.13 కోట్లతో కుమ్రం భీమ్ ఆసిపాబాద్ జిల్లా ఉంది. గత సంవత్సరం ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద రూ.7476 కోట్లు వచ్చింది. ఎక్కువ ఆదాయం వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లలో ఫస్ట్ రంగారెడ్డి ఎస్ఆర్వో చోటు సంపాదించుకుంది. ఆ తరువాత గండిపేట రెండో స్థానంలో నిలిచింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మనకంటే ముందు మహారాష్ట్ర ఉండగా.. ఆ తరువాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఏపీలో వచ్చినట్లు నివేదికలో వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..