Hyderabad: నెహ్రూ జూపార్క్ వెళ్లేవారికి సరికొత్త అనుభూతి.. ఆస్ట్రేలియా కంగారూలను చూసే ఛాన్స్..
హైదరాబాద్ జూపార్క్ సందర్శకులు త్వరలో కొత్త జంతువులను చూడనున్నారు. ఆస్ట్రేలియా కంగారులు నగరానికి రానున్నాయి. ఈ మేరకు వంతారతో జూపార్క్ ఒప్పందం కుదుర్చుకుంది, ఈ కంగారులు జూపార్క్ సందర్శకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. దీంతో పాటు ఆడ జిరాఫీ కూాడా త్వరలో జూపార్క్‌కు చేరనుంది.

రోజు వేలాదిమంది సందర్శకులు, పర్యాటకులు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను విజిట్ చేస్తూ ఉంటారు. చిన్నవారి నుంచి పెద్దవారికి వరకు ఇక్కడి వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. కుటుంబంతో సహా జూపార్క్‌కి వచ్చి రోజంతా గడుపుతారు. ఇక్కడ ఉండే జంతువులను అందరూ చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇక వీకెండ్స్‌లో అయితే సందర్శకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సింహాలు, పులులు, పాములు, ఏనుగులు లాంటి అనేక జంతువులు మనం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో చూడవచ్చు. అయితే త్వరలో మరో కొత్త జంతువులు కూడా ఈ పార్క్‌లో సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేయనున్నాయి.
ఆస్ట్రేలియా నుంచి కంగారులు
ఆస్ట్రేలియా నుంచి కంగారులు నెహ్రూ జూపార్క్‌కు చేరుకోనున్నాయి. గుజరాత్‌లో రిలయన్స్ ఫాండేషన్ వంతార పేరుతో జంతు సంరక్షణ కేంద్రం నడుపుతున్న విషయం తెలిసిందే. జంతువుల మార్పిడి కార్యక్రమం కింత వంతార ఆస్ట్రేలియా కంగారులను నెహ్రూ జూపార్క్‌కు ఇవ్వనుంది. ఇక ఆడ, ఒక మగ కంగారూలను అందించనుంది. ఇవి చేరుకున్న తర్వాత సందర్శకుల కోసం జూపార్క్‌లో ఉంచనున్నారు. సందర్శనకు ఉంచే ముందు కొన్ని రోజులు వాటిని నిర్బంధంలో ఉంచుతారు. ఈ కంగారూలను స్వీకరించేందుకు ఇప్పటికే జూపార్క్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ కంగారులకు ప్రతిఫలంగా తన జంబోలలో ఒక దాన్ని వంతారకు జూపార్క్ అధికారులు ఇవ్వనున్నారు.
గతంలో కూడా ప్రయత్నాలు
2020లో జపాన్‌లోని యోకోహామా జూలాజికల్ గార్డెన్స్ నుంచి నాలుగు కంగారూలను తీసుకొచ్చేందుకు జూపార్క్ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు రెండు జూల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. కానీ కరోనా వల్ల ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇటీవల హైదరాబాద్ వచ్చిన వంతార టీమ్ నెహ్రూ జూపార్క్‌ను సందర్శించింది. ఈ క్రమంలో కంగారూలను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నెహ్రూ జూపార్క్‌లో కంగారూలు ఉండటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇక జూపార్క్‌లోని మగ జిరాఫీ అయిన సన్నీ కోసం త్వరలో ఆడ జిరాఫీని తీసుకురానున్నారు. ఇందుకోసం మైసూర్ జూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆడ జిరాఫీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.




