Hyderabad: మెస్ ఇంచార్జ్‌గా ఉండి ఇదేం పనిరా.. కోఠి ఉమెన్స్ కాలేజీలో కలకలం..!
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న పలువురు విద్యార్థినులు, తాము నివసిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో మెస్ ఇంచార్జీగా పనిచేస్తున్న వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న పలువురు విద్యార్థినులు, తాము నివసిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో మెస్ ఇంచార్జీగా పనిచేస్తున్న వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది.
మెస్ ఇంచార్జీ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్‌లో ఉండాలంటే భయంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన వ్యవహారం కారణంగా చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థినులు వాపోయారు. వినోద్ ప్రవర్తన వల్ల అనేక మంది విద్యార్థినులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
తమ ఆవేదనను ఆడియో రూపంలో కూడా వెల్లడించిన విద్యార్థినులు, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన లేకపోవడంతో చివరకు రహస్యంగా ఆన్‌లైన్ మార్గంలో షీటీమ్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
పేర్లు బయటకు వస్తే తమ కెరీర్, భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్న భయంతోనే ఇంతకాలం మౌనంగా ఉన్నామని విద్యార్థినులు వెల్లడించారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని, తమ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, మెస్ ఇంచార్జీ వినోద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని షీటీమ్ పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




