Telangana: రాత్రి గేదెల డైరీ ఫాంకి వచ్చారు.. ఓనర్ లోపల ఉంటే బయట తాళం వేశారు.. ఆ తర్వాత
రాత్రి చీకటిలో... తాళం వేసి యజమానిని లోపల బంధించారు. బయట మాత్రం వారి టార్గెట్... మూడు లక్షల విలువైన రెండు గేదెలు. సినిమా సీన్‌లా అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి కొంతదూరంలో ఉన్న జాజోనిబావి గ్రామ రైతు కసరమోని ఐలయ్యకు డైరీ ఫాం ఉంది. అందులో 20 గేదెలు ఉన్నాయి. ప్రతిరోజులానే మంగళవారం రాత్రి తన ఫాం వద్ద రూమ్‌లో ఐలయ్య నిద్రపోయాడు. అయితే అర్ధరాత్రి 12 దాటాక గుర్తు తెలియని దుండగులు రహస్యంగా ఫాంలోకి చొరబడ్డారు. మొదటగా యజమాని నిద్రిస్తున్న గదికి బయట నుంచి లాక్ వేశారు. ఆ తర్వాత ముందుగానే రెక్కీ వేసినట్టుగా.. 3 లక్షల రూపాయల విలువ చేసే రెండు గేదెలను ఎంచుకుని తీసుకెళ్లారు.
తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ఐలయ్య తెలివి రావడంతో.. తలుపు తీయబోయాడు… కానీ తాళం బయట నుంచి వేసి ఉందని గుర్తించాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తలుపు పగలగొట్టి అతన్ని బయటకు తీశారు. గేదెలు కనిపించకపోవడంతో వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళన కలిగిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇఖ్కడ క్లిక్ చేయండి..
