గంపెడు ఆశతో చేపల కోసం వల వేస్తే.. దొరికింది చూసి పరేషాన్! ఇంతకీ ఏం చిక్కిందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనం ఏర్పడటంతో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు ఉప్పొంగి జనావాసాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుంది. మరికొన్ని చోట్ల కురిసిన వాన నీరంతా చెరువులు, నదుల్లోకి చేరుతుంది. ఈ క్రమంలో కొందరు జాలరులు చేపల వేటకోసం..

నర్సాపూర్, ఆగస్ట్ 19: వరుణుడి ఉగ్రరూపం ఇప్పట్లో ఆగేలాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనం ఏర్పడటంతో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు ఉప్పొంగి జనావాసాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుంది. మరికొన్ని చోట్ల కురిసిన వాన నీరంతా చెరువులు, నదుల్లోకి చేరుతుంది. ఈ క్రమంలో వరద నీటితోపాటు పాములు సైతం చెరువులు, వాగుల్లోకి కొట్టుకు పోతున్నాయి. అయితే తాజాగా ఓ మత్స్యకారుడు చెరువులో చేపల వేటకు వెళ్లాడు. వర్షాలకు దండిగా చేపలు పడతాయని గంపెడు ఆశతో పడవపై చెరువు మధ్యలోకి చేరుకుని వల విసిరాడు. కాసేపటికే వల కూడా బరువెక్కింది. దీంతో సంబరంగా వలను వడ్డుకు లాగాడు.
కానీ వలలో చేపలకు బదులు ఏదో వింత ఆకారం కనిపించింది. కాస్త తేరిపార చూడగా.. అందులో ఉన్న దానిని చూసి మత్స్యకారుడు ఎగిరిపడ్డాడు. వలలో చేపలకు బదులు భారీ కొండ చిలువ చిక్కుకుంది మరీ. ఈ విచిత్ర సంఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయారావు చెరువులో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో చోటు చేసుకుంది. దీంతో అప్రత్తమైన మత్స్యకారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

మత్స్యకారుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు. వీరు సకాలంలో అక్కడికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం కొండచిలువను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ చిలువ వరద నీటిలో కొట్టుకుని వచ్చి చెరువులోకి వచ్చి ఉంటుందని ఎఫ్ఆర్ఓ అరవింద్ అన్నారు. ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్‌తోపాటు పలువురు అటవీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా చెరువులు, వాగుల్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇలాంటి అనుభవాలు ఎదురవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుచోట్ల మత్స్యకారుల వలకు భారీ కొండ చిలువలు, పాములు చిక్కుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




