Hyderabad: 2 రోజుల్లో 3 ఘటనలు.. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులు
కేవలం 2 రోజుల్లోనే నగరంలో కరెంట్ షాక్‌తో ఏకంగా 8 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కృష్ణాష్టమి రోజున అంటే ఆదివారం రాత్రి రామంతాపూర్‌లోని గోఖుల్‌నగర్‌లో శ్రీకృష్ణుని రథోత్సవం కార్యక్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు..

హైదరాబాద్, ఆగస్ట్ 19: పండగపూట హైదరాబాద్ మహా నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం 2 రోజుల్లోనే కరెంట్ షాక్‌తో ఏకంగా 8 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కృష్ణాష్టమి రోజున అంటే ఆదివారం రాత్రి రామంతాపూర్‌లోని గోఖుల్‌నగర్‌లో శ్రీకృష్ణుని రథోత్సవం కార్యక్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో రామంతాపూర్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇక మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్‌తో ధోని (21), వికాస్ (20) మరణించారు. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని చంద్రాయణగుట్ట నుంచి పురానాపుల్‌కు తీసుకొని వెళ్తుండగా కరెంట్ వైర్లు తగిలాయి. వాటిని కర్రతో పక్కకు లేపుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇక అంబర్‌పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేస్తుండగా కరెంట్ తీగలను కట్టెతో పైకి లేపుతుండగా షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కందపడి పోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా వరుసగా రెండు రోజుల్లో మూడు విద్యుత్ షాక్ ఘటనల్లో 8 మంది మృత్యువాత పడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం వచ్చినట్లు కనిపిస్తుంది. రామాంతాపూర్, పాతబస్తీ బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ల వద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్‌లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు. ఇలా ఉప్పల్, రామాంతాపూర్, చిలకానగర్‌లలో విద్యుత్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




