Telangana Congress: అప్పుడెప్పుడో నినాదం.. మళ్లీ ఇన్నాళ్లకు బీసీ రాగం..! కాంగ్రెస్ పార్టీలో ‘తీన్మార్’ అలజడి..
శత్రువుకు ఎలాంటి ఆయుధాలు ఇవ్వొద్దు. అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల పేరుతో అలజడి సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నా.. కాంగ్రెస్‌లోని బీసీ నేతలెవరూ ఆవేశపడట్లేదు. సహజత్వానికి భిన్నంగా కాంగ్రెస్ నడుచుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి సృష్టించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతోందా? బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరి నోటా వినిపించిన మాట.. బీసీలకు ప్రాధాన్యత. అప్పట్లో టికెట్లను ముందే ప్రకటించిన బీఆర్ఎస్.. 22 మంది బీసీలకు సీట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువే బీసీలకు ఇస్తామంది కాంగ్రెస్. అన్నట్టుగానే బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువే ఇచ్చింది గానీ.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో 2 సీట్ల చొప్పున 34 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వలేకపోయింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 స్థానాలు రిజర్వ్‌డ్ కేటగిరీ. మిగిలిన 88 నియోజకవర్గాలు జనరల్. పైగా అత్యంత బలమైన ఓట్ బ్యాంక్.. బీసీలదే. ముదిరాజ్‌లు 26 లక్షలు, మున్నూరు కాపులు 15 లక్షలు, గౌడ్లు 10 లక్షలు, యాదవులు 13 లక్షలు, పద్మశాలీలు 12 లక్షలు.. ఇలా ప్రతి కమ్యూనిటీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆమాటకొస్తే.. తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్నది బీసీలే. కనీసంలో కనీసం 81 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను బీసీ ఓటర్లే నిర్ణయిస్తారు. అయినా సరే.. ఏ పార్టీ కూడా ఇరవై, పాతికకు మించి సీట్లు ఇవ్వడం లేదు. ప్రతిసారి ఎన్నికలప్పుడే బీసీ నినాదం పుట్టుకొస్తుంది. ఈసారి మాత్రం ఎన్నికలన్నీ అయ్యాక బీసీ నాదం వినిపిస్తోంది.
బీసీ నినాదం కంటే.. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని విమర్శిస్తున్నాయి బీసీ సంఘాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చాయి. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు.. బీఆర్ఎస్ 22 సీట్లు ఇస్తే, కాంగ్రెస్ 23 సీట్లు ఇచ్చింది. మొత్తం జనాభాలో 6.5 శాతమే ఉన్న రెడ్డి సామాజికవర్గానికి మాత్రం.. బీఆర్ఎస్ 42 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రెడ్డి సామాజికవర్గం వారికే కీలక మంత్రి పదవులు దక్కాయన్న విమర్శలు ఉన్నాయి. సో.. తెలంగాణలో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపకం వరకు అన్నింటా బీసీలను పక్కనపెట్టి.. రెడ్డి కమ్యూనిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగానే రోడ్లపైకి వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు గనక 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని డైరెక్టుగానే మాట్లాడుతున్నారు.
వీడియో చూడండి..
బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే కదా.. అప్పట్లో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీపై అంతెత్తున ఫైర్ అయి పార్టీ నుంచి వెళ్లిపోయింది. అటు వి.హనుమంతరావు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ పాటే పాడారు. కాని, అదేంటో.. అధికారంలోకి వచ్చాక సద్దుమణిగారు. వి.హనుమంతరావు కూడా.. బీసీల కోసం పోరాడదాం గానీ, ఇలా రోడ్డెక్కి పార్టీ పరువు పోయేలా మాత్రం కాదని హితవు పలికారు.
ఏదేమైనా.. బీసీ నినాదానికి గానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ డిమాండ్‌పై గానీ.. కాంగ్రెస్‌లోని బీసీ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. రియాక్షన్ వస్తున్నా.. అదంతా తీన్మార్ మల్లన్న మాటల తీరును ఖండిస్తూ మాట్లాడుతున్నారే గానీ అసలైన టాపిక్‌కు అంత మద్దతు దొరకడం లేదు. కారణం ఏంటి? ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుని పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురవడం ఎందుకనా? లేక.. మున్ముందు పదవుల భర్తీ ఉన్నందున గ్రూపులు కట్టడం ఎందుకనా? కారణం ఏదైనా గానీ.. బీసీ నేతలెవరూ అగ్గి రగల్చడానికి సిద్ధంగా లేరన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బీసీలకు టికెట్ల కోసం అందరి కంటే ఎక్కువగా ఫైట్ చేసిన వీహెచ్ కూడా.. ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారే తప్ప దూకుడుగా వెళ్లడం లేదు. ఎలాగూ అధికారంలో ఉన్నది తమ పార్టీనే కాబట్టి.. బీసీలకు ఎలా న్యాయం చేయాలో అంతర్గతంగా మాట్లాడి తేల్చుకోవాలనే నేతలంతా భావిస్తున్నారు తప్ప.. రోడ్డెక్కి రచ్చ చేసుకోవాలనుకోవడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..