PK Meet CM KCR: సీఎం కేసీఆర్‌తో పీకే భేటీ.. మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం.. అందుకే..

పార్టీ ఏర్పాటు తర్వాత పరిణామాలు, పర్యవసానాలు, రోడ్‌ మ్యాప్‌పై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటును సీరియస్‌గా పరిశీలిస్తోన్న గులాబీ బాస్‌..

PK Meet CM KCR: సీఎం కేసీఆర్‌తో పీకే భేటీ.. మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం.. అందుకే..
Cm Kcr Meet Prashant Kishor
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 12, 2022 | 7:45 PM

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(Prashant Kishor) హైదరాబాద్‌లోనే మకాం వేయడం తెలంగాణ రాజకీయాల్లో మరింత హాట్ హాట్‌గా మారింది. ఆదివారం సీఎం కేసీఆర్‌తో(CM KCR) భేటీ అయిన పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ కీలకాంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీ ఏర్పాటు తర్వాత పరిణామాలు, పర్యవసానాలు, రోడ్‌ మ్యాప్‌పై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటును సీరియస్‌గా పరిశీలిస్తోన్న గులాబీ బాస్‌.. రాష్ట్రపతి ఎన్నికలపైనా దృష్టిపెట్టారు. బీజేపీయేతర అభ్యర్ధిని రంగంలోకి దింపే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రత్యర్ధిగా నిలవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

మరోవైపు.. నేషనల్‌ పార్టీ ప్రకటనపై ముమ్మర కసరత్తు చేస్తోన్న సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటమి ఖాయమని , ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ జాతీయ రాజీకీయం పేరుతో కొత్త బాణీ అందుకున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడమంటున్నారు బీజేపీ నేతలు. ఆయన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. బీజేపీ మీద విషప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తమకు టీఆర్‌ఎస్ మద్దతుతో పనిలేదనీ.. దేశ ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు కిషన్‌రెడ్డి.

8 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు మేము సిద్ధం.. మరి కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశంలో కుటుంబ పార్టీలన్నీ అంతమవుతున్నాయ్.. టీఆర్‌ఎస్ పరిస్థితి కూడా అదేనంటూ అభిప్రాయపడ్డారాయన.

సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కేంద్రాన్ని దెబ్బకొట్టే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలే అందుకు సరైన అవకాశంగా భావిస్తున్నారు గులాబీ బాస్. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఎంత వరకు ఉండబోతుందనేది.. రాష్ట్రపతి ఎన్నికలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.